ఖైరతాబాద్, సెప్టెంబర్ 17: లంబాడా రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఈ నెల 19న ఇందిపార్కు వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. లంబాడా జాతి నిర్వీర్యానికి కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చాలా పోరాటాల ఫలితంగా లంబాడాలకు 1976లో ఎస్టీ రిజర్వేషన్ల ఫలాలు దక్కాయని తెలిపారు.
2022 సెప్టెంబర్ 17న బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచారని గుర్తుచేశారు. నేడు కొన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ, లంబాడాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అది ఇరువర్గాలకు నష్టమని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీలు సీతారాంనాయక్, మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, రిటైర్డ్ ఏడీజీపీ డీటీ నాయక్ పాల్గొన్నారు.