Heerya Naik | సంగారెడ్డి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తరతరాలుగా తమకు అన్నం పెడుతున్న భూమితో అనుబంధాన్ని వదులుకోలేక.. దౌర్జన్యంగా గుంజుకోజూసిన రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఎదురుతిరిగిన పాపానికి ఆ రైతు 30 రోజులుగా జైల్లో మగ్గుతున్నాడు. ఓవైపు మనోవ్యథ.. మరోవైపు వెంటాడుతున్న అనారోగ్యం కారణంగా గుండెపోటుకు గురైన ఆ గిరిజనుడికి ఉగ్రవాదికో .. దోపిడీ దొంగకో వేసినట్టు బేడీలు వేసి ఖాకీల వాహనంలోనే పోలీసులు దవాఖానకు తరలించారు. వదిలితే పారిపోతాడనుకున్నారో ఏమో! బేడీలు ఉండగానే వైద్య పరీక్షలు, ఇతర టెస్టులు కూడా చేయించారు. అన్నంపెట్టే రైతుకే సంకెళ్లు వేసి దవాఖానకు తరలించిన అమానవీయ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు, గిరిజన, రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
లగచర్ల గిరిజన రైతులను నెలరోజుల పాటు జైలులో పెట్టి హించించినా రేవంత్ సర్కార్‌కు ఇంకా కక్ష తీరినట్టు కనిపించడం లేదు. జైలులో గుండెనొప్పి వచ్చిన గిరిజన రైతు హీర్యానాయక్(44)కు వైద్యం అందించడంలోనూ పట్టింపులేకుండా వ్యవహరించింది. అంతటితో ఆగకుండా గుండెనొప్పితో బాధపడుతున్న హీర్యానాయక్‌కు సంకెళ్లు వేసి దవాఖానకు తరలించి తన క్రూరత్వాన్ని చాటుకున్నది. సంగారెడ్డి జిల్లా కంది జైలులో గుండెపోటుతో బాధపడుతున్న లగచర్లలోని పులిచర్లకుంటతండాకు చెందిన హీర్యానాయక్‌ను అంబులెన్స్‌లో కాకుండా బేడీలతో పోలీసు జీపులోనే గురువారం సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది.
ఎలాంటి ఎస్కార్ట్స్ లేకుండా, వైద్య సిబ్బంది లేకుండా జైలు వాహనంలో అధికారులు హీర్యానాయక్‌ను బేడీలతో దవాఖానకు తీసుకొచ్చారు. గండెనొప్పితో తల్లడిల్లిపోతూ దవాఖాన బెడ్‌పై మెలితిరుగుతున్నా సంకెళ్లు తొలగించలేదు. మానవీయతను చాటుకోవాల్సిన జైలు అధికారులు, పోలీసులు బేడీలు తీయకుండానే వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు ఈజీసీ, 2డీ ఈకో టెస్టులు చేస్తున్న సమయంలోనూ హీర్యానాయక్‌కు సంకెళ్లను తీయలేదంటే అన్నంపెట్టే రైతుపట్ల రేవంత్ సర్కార్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు!
లగచర్ల ఘటనలో రిమాండ్ అయిన హీర్యానాయక్‌కు కంది జైలులోనే బుధవారం మధ్యాహ్నం స్వల్పంగా గండెనొప్పి వచ్చింది. దీంతో జైలు వైద్యులు పరీక్షలు చేశారు. అక్కడే ఈసీజీ తీసి చికిత్స కోసం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ వైద్యశాలకు తరలించారు. సంగారెడ్డి దవాఖానలో ఈసీజీ ఇతర పరీక్షలు చేసిన వైద్యులు మందులు రాసి పంపించారు. బుధవారం రాత్రి మరోమారు హీర్యానాయక్‌కు గండెనొప్పి రావటంతో తిరిగి సంగారెడ్డి దవాఖానకే తీసుకురాగా వైద్యులు చికిత్స చేసి పంపించారు. గురువారం ఉదయం హీర్యానాయక్ గండెనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
జైలు సిబ్బంది అతడిని అంబులెన్స్‌లో కాకుండా జైలు వాహనంలోనే చేతికి బేడీలు వేసి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్ నేతృత్వంలో వైద్యులు అశోక్, మజీద్‌ఖాన్ ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు చేయగా ఆసమయంలోనూ రైతుకు బేడీలు తీయలేదు. పరీక్షలు ముగిసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం పంజాగుట్టలోని నిమ్స్‌కు తరలించాలని సూపరింటెండెంట్, వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. హీర్యానాయక్ చాలారోజులుగా ఛాతి నొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. 2డీ ఈకో పరీక్ష చేయగా గుండె బలహీనంగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. సంగారెడ్డిలో కాథల్యాబ్ లేనందున నిమ్స్‌కు రిఫర్ చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
అండర్ ట్రయల్‌లో ఉన్న ఖైదీలకు సంకెళ్లు వేయవద్దని గతంలో కోర్టులు చెప్పినా అవేమీ పట్టించుకోండా కంది సెంట్రల్ జైలు పోలీసులు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేసి దవాఖానకు తరలించటం తీవ్ర విమర్శలకు దారితీసింది. జైలు అధికారుల తీరును గిరిజన, రైతు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఓ రైతుకు, అదీగాక గుండెపోటుతో బాధపడుతున్న అన్నదాతకు సంకెళ్లు వేసి దవాఖానకు తీసుకురావడంపై బీఆర్ఎస్ నాయకులు నిప్పులుచెరిగారు. సంగారెడ్డి దవాఖానలో హీర్యానాయక్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ సర్కార్ తీరుపై ధ్వజమెత్తారు. ఈ ఘటనపై అన్నివర్గాల నుంచి ఆగ్రహావేశాలు, విమర్శలు వెల్లువెత్తడంతో జైలు అధికారులు, పోలీసులు తప్పు సవరించుకుని హీర్యానాయక్‌ను మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించే సమయంలో సంకెళ్లను తొలగించారు.
హీర్యానాయక్‌కు గండెనొప్పి వచ్చిన విషయం తెలుసుకున్న భార్య దేవీబాయి, తండ్రి రూప్లానాయక్, తల్లి లచ్చిమిబాయి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు వచ్చారు. వారివెంట లాయర్ రాంచందర్ ఉన్నారు. హీర్యానాయక్‌ను కలిసేందుకు వారు ప్రయత్నించగా గదిబయటనే పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులను అడ్డుకోవడంపై అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకుడు జైపాల్‌నాయక్, లాయర్ రాంచందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హీర్యానాయక్‌ను కలిసేందుకు కుటుంబసభ్యులను అనుమతించాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని జైపాల్‌నాయక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు, జైపాల్‌నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది.
చివరికి హీర్యానాయక్‌ను కలిసేందుకు ఆయన భార్య దేవీబాయి, లాయర్ రాంచందర్‌ను అనుమతించారు. ఇద్దరూ పది నిమిషాలపాటు హీర్యానాయక్‌తో మాట్లాడారు. చక్రాలకుర్చీపై తరలిస్తున్న క్రమంలో కొడుకును చూసిన రూప్లానాయక్, లచ్చిమిబాయి కన్నీరుమున్నీరయ్యారు. భార్య దేవీబాయి సైతం పెద్దపెట్టున రోదించింది. తన కొడుక్కు ఇలా అవడానికి సీఎం రేవంత్‌రెడ్డే కారణమని రూప్లానాయక్ ఆవేదన వ్యక్తంచేశాడు. హీర్యానాయక్‌కు ఏదైనా జరిగితే రేవంత్‌రెడ్డి, ఆయన అన్న తిరుపతిరెడ్డే బాధ్యులని శాపనార్థాలు పెట్టాడు. అంబులెన్స్‌లో హీర్యానాయక్ వెంట తామూ వస్తామని కుటుంబ సభ్యులు పట్టుబట్టగా జైలు సిబ్బంది, పోలీసులు నిరాకరించారు. చివరకు లాయర్ రాంచందర్ ఒత్తిడి మేరకు భార్య దేవీబాయి ఒక్కరినే అనుమతించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 12 (నమస్తే తెలంగాణ): హీర్యానాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కార్డియో విభాగంలో అతడికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నదని స్పష్టం చేశారు.
నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న హీర్యానాయక్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య పరామర్శించారు. ఘటనపై సీఎం దృష్టికి తీసుకెళ్లి కేసులు ఎత్తివేయిస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. అధికారులపై దాడి సమయంలో తాను లేనని, అమాయకుడినైన తనను అక్రమంగా అరెస్టు చేశారని బాధిత రైతు హీర్యానాయక్ కమిషన్ చైర్మన్‌కు విన్నవించారు. భయంతోనే ప్రాణం పోయేలా ఉన్నదని, కేసులు ఎత్తివేసి తన ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. రైతును పరామర్శించిన వారిలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, అధికారులు ఉన్నారు.
హీర్యానాయక్‌కు గుండె పోటు వచ్చిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు అంతా ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో హీర్యా నాయక్‌కు గుండెపోటు అనే విషయం తెలుసుకొని తమ బిడ్డకు ఏమైంది? ఏ దవాఖానలో ఉన్నాడు? అంటూ సమాచారం కోసం ఎంత ప్రయత్నించినా పోలీసులు చెప్పలేదు. ఓ సారి కోస్గి దవాఖానలో ఉన్నాడని, మరోసారి ఉస్మానియా దవాఖాన అని, ఇంకోసారి గాంధీలో ఉన్నాడని సమాచారం వస్తుండటంతో వాళ్లంతా ఆయా దవాఖానల చుట్టూ తిరిగి అలిసిపోయారు. చివరికి హీర్యానాయక్ నిమ్స్‌లో ఉన్నాడని తెలిసి అక్కడికి చేరుకున్నారు.
‘నా కొడుకు హీర్యానాయక్ ఏమైనా దొంగనా? గండెనొప్పితో బాధపడుతున్న నా కొడుకును బేడీలతో ఎట్లా దవాఖానకు తీసుకొస్తరు? గుండె నొప్పి వచ్చినా మాకు చెప్పరా’ అని జైలు అధికారులు, పోలీసులపై తండ్రి రూప్లానాయక్ తీవ్రంగా మండిపడ్డారు. ‘నా బిడ్డను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిండ్రు. ఆని చేతికి బేడీలు చూస్తే గుండె తరుక్కుపోయింది’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. హీర్యానాయక్‌ను నిమ్స్‌కు తరలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మాకంపెనీకి భూములు ఇవ్వనందుకు తన కొడుకుపై అక్రమంగా కేసులు పెట్టి జైలులో వేశారని కన్నీరుమున్నీరయ్యారు. ‘కలెక్టర్‌పై దాడి జరిగిన రోజు నా కొడుకు అక్కడ లేనేలేడు. ఆలుమొగలిద్దరూ కొస్గికి పనికి పోయిండ్రు.
పోలీసులు దొంగల్లా అర్ధరాత్రి ఒంటిగంటకు వచ్చి లైట్లు బందు పెట్టి నాకొడుకును పట్టుకపోయిండ్రు. నన్ను నిద్రలేని నీ వయస్సెంత అని అడిగితే 70 ఏండ్లు అని చెప్పిన. ముసలోన్నని నన్ను పట్టుకపోలే కావచ్చు. నేను రేవంత్‌రెడ్డి కోసం కొట్లాడిన. మా తండా నుంచి వంద ఓట్లు చేతిగుర్తుకు వేయించిన. ఆ పాపానికి మా పచ్చని పొలంలో రేవంత్‌రెడ్డి చిచ్చుపెట్టిండు. నా కొడుకు బిడ్డది నిశ్చిరార్థం పెట్టుకున్నం. ఈ టైంల నా కొడుకును జైల్లో పెడుతవా రేవంత్‌రెడ్డీ? హీర్యానాయక్‌కు ఏమైనా జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి, తిరుపతిరెడ్దిదే బాధ్యత. వాళ్ల ఇండ్ల ముందు బైటాయించి ఆందోళన చేస్తం. నా కొడుకును వదలకపోతే రేవంత్‌రెడ్డి ఇంటి ముందట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటం’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
లగచర్ల ఘటనకు సంబంధించి 24 మందికిపైగా రైతులు సుమారు నెల నుంచి కంది జైలులో ఉన్నారు. వీరిలో కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హీర్యానాయక్ గుండెనొప్పితో బాధపడుతుండగా మరో ఇద్దరు రైతులు రాఘవేందర్, బసప్ప అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. బసప్ప గుండెసంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాఘవేందర్ చలి జ్వరంతో బాధపడుతుండగా వీరికి జైలులోనే చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గురువారం మధ్యాహ్నం జైలులో బసప్ప, రాఘవేందర్‌ను కలిసి వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. తమకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వారు కన్నీరు పెట్టడంతో ఎమ్మెల్యే జైలు అధికారులతో మాట్లాడారు. గొండెనొప్పితో బాధపడుతున్న హీర్యానాయక్‌ను బేడీలతో దవాఖానకు తరలించడం దారుణమని మండిపడ్డారు. న్యాయం కోసం పోరాటం చేస్తే సంకెళ్లు వేస్తారా? అని నిలదీశారు.
హీర్యానాయక్‌కు బేడీలు వేసి దవాఖానకు తీసుకురావటం ఏమిటని వికారాబాద్‌కు చెందిన లాయర్ రాంచందర్ ప్రశ్నించారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఎదుట ఆయన మాట్లాడుతూ లగచర్ల రైతుల పక్షాన తాను వాధిస్తున్నట్టు చెప్పారు. జైలు అధికారులు, పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. రిమాండ్‌లో ఉన్న రైతులకు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తే మా జ్యూరిడిక్షన్ కాదని వికారాబాద్ కోర్టు తెలిపిందని, బెయిల్ అంశం స్పెషల్‌కోర్టు హైదరాబాద్‌లో ఉందని చెబితే అక్కడికి వెళ్లినా మా జ్యూరిడిక్షన్ కాదని చెప్పారని, దీంతో హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ ఫైల్ హైకోర్టు ముందుకు వస్తుందని చెప్పినట్టు వివరించారు.
మానవతా దృక్పథంతో కోర్టు హీర్యానాయక్తోపాటు ఇతర రైతులకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం ఫార్మా విలేజ్‌ను రద్దు చేసిన నేపథ్యంలో రైతులపై ఉన్న కేసులను రద్దు చేయాలని కోరారు. గిరిజన నాయకుడు జైపాల్‌నాయక్ మాట్లాడుతూ గుండెనొప్పితో బాధపడుతున్న గిరిజన రైతును ఏదో దేశద్రోహిలా బేడీలతో దవాఖానకు తీసుకురావటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే గిరిజన రైతులపై కేసులు ఎత్తివేయాలని, హీర్యానాయక్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
ఏం జెప్పాలె సారూ. మావోనికి గుండె నొప్పి లేకుండె. ఆరోజు పొద్దాడసందీ పనిజేసి వచ్చిండు. ఇంట్ల పండుకున్నడు. ఒక్కటిగొట్టంగ పోలీసులు వచ్చి పట్టుకొని బస్సుల వేసిండ్రు. మమ్మల్నీ కొట్టడానికి వచ్చిండ్రు. అద్దాలన్నీ పగలగొట్టిండ్రు. నా కొడుకును అన్యాయంగ జైల్ల ఏసినందుకే గండె నొప్పి వచ్చింది. మేము భూమి ఇయ్యం.. ఏమియ్యం.. మా కొడుకుని ఇంటికి తోలియ్యాలె. జైలుకు భయపడం. మా పిల్లగానికి ఏమన్న జరిగిందో.. సూడున్రి..
– లఛ్చిమీ బాయి, హీర్యా నాయక్ తల్లి