హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక లేక ఇతర ట్రస్టుల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు, కార్మికులకు ప్రతిభ ఆధారంగా రూ. 1000-2000వరకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్టు సంక్షేమ మండలి ప్రకటనలో తెలిపింది. 2023-24విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ, ఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ, డిప్లొమా తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారిని ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 15లోగా దరఖాస్తులను సహాయ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. మేడే నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి వారి బ్యాంకు ఖాతాల్లో ఉపకార వేతనాలు జమ చేస్తామని వివరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ గెలల ధరను పెంచుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం టన్ను గెలల ధర 19,144 ఉండగా దీన్ని రూ. 20,506కు పెంచినట్టు పేర్కొన్నారు. నేటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపారు.