డిచ్పల్లి, జూలై 8 : ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన తెలంగాణ యువకుడిని గుట్టుచప్పుడు కాకుండా ఎడారిలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. డిచ్పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన గుగులోత్ కైలాస్ (30) బీటెక్ పూర్తి చేసి, ఐదేండ్ల క్రితం కువైట్ వెళ్లాడు. సాల్మి ఎడారి ప్రాంతంలో జరుగుతున్న హైవే నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నాడు. మార్చి 19న తన తల్లిదండ్రులకు చివరిసారిగా ఫోన్ చేసిన అతడు ఆచూకీ లేకుండాపోయాడు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు కువైట్‌లో తమకు తెలిసిన వారితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు.
కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజీలో నమోదైన ఆధారాలతో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. క్రేన్ ప్రమాదంలో కైలాస్ మృతి చెందాడని, ఇది తమ మీదకు వస్తుందన్న భయంతో తన తండ్రితో కలిసి ఇసుకలో పాతి పెట్టామని నిందితుడు తెలిపాడు. నిందితులది డిచ్పల్లి మండలం సాంపల్లి తండాపరిధిలోని ఓ ప్రాంతమని కైలాస్ కుటుంబ సభ్యులకు కువైట్ నుంచి సమాచారమందింది.