యాదగిరిగుట్ట/కుత్బుల్లాపూర్, జూలై 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్ రూ.55,03,500 విరాళం సమర్పించారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి, కూకట్పల్లి ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, మాధవరం కృష్ణారావు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో కలిసి ఆదివారం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. స్వర్ణతాపడం విరాళానికి సంబంధించిన నగదును ఆలయ డీఈవో దోర్బల భాస్కర్‌శర్మ, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్వర్ణతాపడానికి కుత్బులాపూర్ నియోజకవర్గం తరఫున విరాళాన్ని అందజేసినట్టు తెలిపారు. గతంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తరఫున విమాన గోపురానికి 10 కిలో ల బంగారం అందజేసినట్టు చెప్పారు. ప్ర పంచమే అబ్బురపడే విధంగా యాదగిరిగు ట్ట దేవస్థానం, కాళేశ్వరం ప్రాజెక్టు, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని నిర్మించుకొని గొప్పగా పరిపాలన సాగిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. స్వరాష్ట్రంలో తెలంగాణ రూపురేఖలు మారాయని, దేశమంతా తెలంగాణ వైపే చూస్తున్నదని అన్నారు.