హైదరాబాద్/యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆయనకు బీ ఫాంను, ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును అందించారు. అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
అన్ని అంశాలను పరిశీలించి..
మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఉద్యమకారుడిగా గుర్తింపుపొందారు. ఉద్యమ సమయం లో కేసీఆర్ పిలుపుతో కూసుకుంట్ల తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయం, సర్వే రిపోర్టులను పరిశీలించిన మీదట పార్టీ అధినేత కేసీఆర్.. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీలో మంచి పట్టు, ప్రజాబలం మెండుగా ఉండటం, గత ఎన్నికల్లో ఓడిపోయినా అవిశ్రాంతంగా పనిచేస్తుండటంతో ఆయనను టికెట్ వరించింది. రెండుమూడు రోజుల్లో ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూసుకుంట్ల స్వగ్రామం సంస్థాన్ నారాయణపురం మం డలం లింగంవారిగూడెం. బీఎస్సీ, బీఈడీ చదివారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. 2014లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి మునుగోడులో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. 2018 లో ఓటమిపాలయ్యారు. ఉద్య మ సమయంలో పలు ఉపఎన్నికలకు ఇంచార్జిగా పనిచేసిన అనుభవం ఉన్నది.
కేటీఆర్‌ను కలిసిన కూసుకుంట్ల
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.