Prabhakar Reddy | రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన సాగిస్తుందని.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులను ప్రభుత్వం గొంతు నొక్కుతోందని కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత అన్నపర్తి శేఖర్ అరెస్టుపై జిల్లా ఎస్పీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పనితీరుపై ఇప్పటికే ప్రజలు అభిప్రాయానికి వచ్చారని.. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనబాట పడుతున్నారని మండిపడ్డారు. మునుగోడు ఎమ్మెల్యే అభివృద్ధిని మరిచి వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నాయకులపై కుట్రలకు చర్యలు చేపడుతున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని.. అభివృద్ధిపై ప్రజలతో మమేకమై సాగాలి తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేసే విధానం సరైనది కాదన్నారు.
మంత్రి పదవి వస్తుందని ఊహించుకొని అది రాకపోవడంతో సహనం కోల్పోయి ఇష్టానుసారంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని రోజులు గడ్డం పెంచుకొని తిరుగుతున్నాడని.. శాశ్వతంగా మంత్రి పదవి రాదని తెలిస్తే ఏమైతాడో అర్థం కావడం లేదన్నారు. ఆయన విధానాలపై ప్రజలు ఆలోచన చేయాలని.. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ అంతటికి ప్రజాప్రతినిధి అన్నది మరచి కొంతమందికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలు మార్చి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న అన్యపర్తి శేఖర్ని.. అర్ధరాత్రి అక్రమంగా భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. పోలీసులు చట్టంపై తమకు గౌరవం ఉందని న్యాయం జరిగేంత వరకు శేఖర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. శేఖర్ అరెస్టు అన్యాయమని ఇంతటి చర్యలకు పాల్పడ్డ వారు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు.