కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బాబేఝరి గ్రామ పంచాయతీలోని శివగూడలో కొలాం తెగకు చెందిన ఆదివాసులకు రెడిమేడ్ ఇం డ్లు నిర్మించి ఇవ్వాలని ఐటీడీఏ ప్రణాళిక రూపొందించింది. 13 మంది లబ్ధిదారులకు ఇండ్లు కట్టించాలని నిర్ణయించింది. మొదట తేకం మాణిక్రావ్కు హాల్, బెడ్ రూం, కిచెన్, మరుగుదొడ్డి సౌకర్యాలతో ఇంటిని పూర్తి చేశారు. కిటికీలకు కూలింగ్ అద్దాలు ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇంటి నిర్మాణానికి నెల రోజుల సమయం పట్టిందని, ఇది 50 ఏండ్ల వరకు రక్షణ ఇస్తున్నదని ఐటీడీఏ ఏఈ నజీమొద్దీన్ తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.40 లక్షల దాకా ఖర్చు అవుతున్నదని తెలిపారు. మిగతా 12 ఇండ్లను త్వరలో పూర్తి చేస్తామని నజీమొద్దీన్ వెల్లడించారు. – కెరమెరి