తెలంగాణ చౌక్(సిరిసిల్ల), జూలై 30: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చీటర్‌ను సిరిసిల్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు చెందిన వందలాది మంది అమాయకులకు కుచ్చుటోపీ పెట్టినట్టు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం నిందితుడి అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌కు చెందిన కట్టుకోజుల రమేశ్ అలియాస్ రమేశ్‌చారి కొంతకాలం ప్రైవేట్ టీచర్‌గా పని చేశాడు. ఆ తరువాత ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ చేశాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించేందుకు మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు.
తెలంగాణ, ఆంధ్రా ప్రజలే టార్గెట్‌గా ఎలక్ట్రానిక్ గూడ్స్, బంగారం విక్రయిస్తానని ఆన్లైన్ వ్యాపారానికి తెరలేపాడు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్‌లు పెడుతూ స్వల్ప కాలంలోనే రెట్టింపు లాభం వస్తుందని నమ్మబలికాడు. మొదట చిన్నచిన్న వస్తువులను అమ్మి కేవలం డెలివరీ చార్జీలు మాత్రమే తీసుకున్నాడు. ఇది నమ్మిన పలువురు విలువైన వస్తువులను ఆర్డర్ చేశారు. ఇదే అదునుగా వారికి సామగ్రి ఇవ్వకుండా మోసం చేశాడు. అతడి ద్వారా మోసపోయిన ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన ఆదర్శ్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా సీఐ సదన్‌కుమార్, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ జూనైద్తో కలిసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదర్శ్ గౌడ్ ఆవునూర్ గ్రామానికి వస్తున్నట్టు తెలుసుకొని శనివారం అరెస్టు చేసినట్టు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ. 9 కోట్ల మేరా లావాదేవీలు జరిగినట్టు వెల్లడైందని ఎస్పీ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాదిలో నిందితుడి మీద 11 కేసులు నమోదైనట్టు చెప్పారు. 2018లో జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 8 కేసులు ఉన్నాయని, నిందితుడికి సంబంధించిన నాలుగు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.