హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుందో? లేదో? స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు కోరిన నేపథ్యాన్ని గుర్తుచేస్తూ.. విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మారంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా నంబర్ వన్‌గా నిలిపే ఉద్దేశంతో 9.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేలా ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
ఇప్పటికే ఫార్మాసూటికల్స్ ఉత్పత్తుల్లో దేశంలోనే తెలంగాణ 40 శాతం వాటా కలిగి ఉన్నదని, వెయ్యికి పైగా లైఫ్సెన్సెన్స్ కంపెనీలకు అడ్డాగా మారిందని.. ఏటా 80 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను తయారుచేస్తున్నదని వివరించారు. ఇలాంటి కీలకమైన రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే రాష్ట్రానికి ఆదాయం పెరగటంతో పాటు మన యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అందించవచ్చన్న భావనతో ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్టు వెల్లడించారు. దీనికోసం భూ సేకరణ కూడా పూర్తిచేశామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెద్దఎత్తున మేలు చేసే ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌పై గందరగోళం నెలకొన్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. హఠాత్తుగా ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించటంతో ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఆందోళన చెందాయని తెలిపారు. ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత, బతుకులు బాగుపడుతాయని భూములు ఇచ్చిన రైతుల్లో గందరగోళం నెలకొన్నదని వెల్లడించారు. ప్రాజెక్ట్ కోసం రైతులు ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడతామని ప్రభుత్వం చెప్తుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తే గత ప్లాన్ ప్రకారం గానీ, మరింత విస్తరించేలా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మొండిపట్టుదలకు పోయి రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీయవద్దని సూచించారు.
ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తే భూములు ఇచ్చిన రైతులకు వాటిని వెంటనే అప్పగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇతర అవసరాలకు వాడుతామంటే రైతులతో పాటు బీఆర్ఎస్ సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా ఉండాలని స్పష్టంచేశారు. ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని భావిస్తే లైఫ్సెన్సెన్స్కు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్‌గా మార్చే అవకాశాన్ని కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలు, అనిశ్చితి, తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్ర పురోగతి దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా ఉండాలని ఆకాంక్షించారు.