హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): స్విట్జర్లాండ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన దిగ్విజయంగా ముగిసింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్ ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీలకు ప్రధాన వేదికగా మారడంతో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణలో కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు అనేక కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలను కుదుర్చుకోగా.. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. తద్వారా మంత్రి కేటీఆర్ మొత్తంగా రూ.4,200 కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగారు. మరికొన్ని కంపెనీలు తమ పెట్టుబడి వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపాయి.
లండన్ పర్యటన అనంతరం నేరుగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ నెల 23న దావోస్ చేరుకున్న మంత్రి కేటీఆర్.. అక్కడ మూడు రోజులపాటు క్షణం తీరిక లేకుండా గడిపారు. అనేక దిగ్గజ కంపెనీల ప్రముఖులతో సమావేశమై రాష్ర్టానికి పెట్టుబడులు రాబట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. అనేక బృంద చర్చల్లో పాల్గొని తెలంగాణ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా గత ఎనిమిదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, జీడీపీలో రాష్ట్ర వాటా పెరుగుదల తదితర అంశాల గురించి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మెచ్చుకొంటూ పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్న వైనం, పరిశ్రమల స్థాపనకు ఇక్కడ ఉన్న సానుకూలతల గురించి వివిధ కంపెనీల అధిపతులకు, ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రముఖులకు వివరించారు. సమయాభావం వల్ల మంత్రి కేటీఆర్‌ను కలవలేకపోయిన కొన్ని కంపెనీల అధిపతులు త్వరలో హైదరాబాద్‌కు వచ్చి సమావేశమవుతామని, ఆ తర్వాత పెట్టుబడుల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈ చర్చల్లో కేటీఆర్ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను విస్పష్టంగా వెల్లడించడం వారిని విశేషంగా ఆకట్టుకొన్నది.