హైదరాబాద్ : ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన 40 అడుగుల పార్టీ పతాకాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ జెండా నిర్మాణ పనులను మంగళవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ 21వ విర్బావ దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో పార్టీ పతాకాలను ఎగురవేసేందుకు ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నగరంలోని అన్ని ప్రాంతాలు గులాబీమయంగా మారాయన్నారు. అదేవిధంగా పార్టీ ప్లీనరీ నిర్వహించే హెచ్ఐసీసీకి వెళ్లే రహదారుల వెంట, పరిసరాలు పూర్తిగా స్వాగత తోరణాలు, కటౌట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.