హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ దివ్యాంగ విద్యార్థి కోచింగ్ పూర్తయ్యే వరకు హాస్టల్ ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. బాగా చదువుకో తమ్ముడు అని ప్రోత్సహిస్తూ ఆప్యాయతను పంచారు. దీంతో ఆ యువకుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ తెలంగాణ భవన్లో చోటుచేసుకున్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన గిడ్లే విష్ణు చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు తొడల వరకు కోల్పోయాడు. పదో తరగతి పూర్తిచేసిన విష్ణు.. కంప్యూటర్ శిక్షణ కోసం హైదరాబాద్ గాంధీనగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ ఫీజు చెల్లించే స్థోమతలేక దిక్కుతోచలేదు. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ తన మనసులో మెదిలిందే తడవుగా తెలంగాణ భవన్ బాటపట్టాడు. ఆదివారం కేటీఆర్‌ను కలిసి తన సమస్య ను చెప్పుకున్నాడు. ఆ యువకుడి బాధలు విన్న కేటీఆర్ తక్షణమే స్పందించారు. ‘కోచింగ్ పూర్తయ్యేవరకు హాస్టల్ ఫీజు చెల్లిస్తా. కష్టపడి బాగా చదువుకో తమ్ముడు’ అని ఆ యువకుడికి కేటీఆర్ అభయం ఇచ్చారు. తనకు సాయంగా నిలిచిన కేటీఆర్‌కు ఈ సందర్భంగా విష్ణు కృతజ్ఞతలు తెలిపారు.