హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తేతెలంగాణ): చాట్‌జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రతిపాదన చేశారు. సకల సౌకర్యాలు ఉన్న హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు ఎక్స్ ద్వారా ఆహ్వానం పలికారు. హైదరాబాద్‌ను భారతదేశానికి సరైన ప్రవేశ ద్వారంగా పేర్కొన్న కేటీఆర్, ఓపెన్ ఏఐలాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రంగా అభివర్ణించారు.
సంస్థను నెలకొల్పేందుకు సానుకూల వాతావరణం కలిగి ఉన్నదని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్నదని, టీహబ్, వీహబ్, టీవర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అండ్ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ లాంటివి ఉన్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్ ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్కమ్ లాంటి అనేక గ్లోబల్ టెక్ దిగ్గజాలకు కేంద్రంగా మారిందని వివరించారు.
ఇక్కడ సాంకేతిక, స్టార్టప్ రంగాల్లో అపారమైన ప్రతిభ ఉన్నదని పేర్కొన్నారు. మానవ వనరులకు కొరతలేదని చెప్పారు. తెలంగాణను దేశానికి ఏఐ రాజధానిగా మార్చేందుకు దశాబ్ద కాలంగా ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. ఇందులో భాగంగా 2020ని ‘ఇయర్ ఆఫ్ ఏఐ’గా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.
ఏఐ ఆధారిత కార్యక్రమాలను విరివిగా ప్రోత్సహించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రతిభ, ఇన్నోవేషన్, నూతన ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీల కలయికతో ఏఐ విప్లవాన్ని ముందుకు నడిపిస్తున్నదని నొక్కి చెప్పారు. ఇన్ని అనుకూలతలు ఉన్నందున ఓపెన్ ఏఐ తన కార్యకలపాలను ఇక్కడ ప్రారంభించాలని పునరుద్ఘాటించారు.