Sircilla | రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): వస్త్ర నగరిగా ఖ్యాతి పొందిన సిరిసిల్ల సిగలో మరో మణిహారం చేరింది. జిల్లాలోని మహిళలు, యువతులకు ఉపాధి కల్పించాలన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షతో రూపుదిద్దుకున్న అపారెల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర తయారీ దిగ్గజ సంస్థ టెక్స్‌పోర్ట్ తమ పరిశ్రమను ప్రారంభించడానికి సిద్ధమైంది. దీంతో టీ షర్టులు, జీన్స్ ప్యాంట్ల తయారీలో రెండువేల మందికి ఉపాధి లభించనున్నది. ఇప్పటికే గోకుల్దాస్ సంస్థ ప్రారంభించిన గ్రీన్ నీడిల్ యూనిట్లో వెయ్యి మంది మహిళలు, యువతులు ఉపాధి పొందుతుండగా, ఇప్పుడో మరోసారి భారీ ఎత్తున ఉపాధి లభిస్తున్నందుకు జిల్లా ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
మరమగ్గాల వస్త్ర పరిశ్రమలో తెలంగాణకే తలమానికమైన సిరిసిల్లలో మహిళలు, యువతులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో సిరిసిల్లకు మహర్దశ వచ్చింది. బతుకమ్మ చీరెల ఆర్డర్లతో నేతన్నలకు బతుకు చూపింది. బీడీలపై ఆధారపడి పొగచూరిన బతుకుల్లో వెలుగులు నింపాలన్న సంకల్పంతో అప్పటి చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ జిల్లా కేంద్రంలోని రెండో బైపాస్‌రోడ్డులో రూ.175 కోట్లతో 65 ఎకరాలలో అధునాతన హంగులతో అపారెల్ పార్కును నిర్మించారు. అంతర్జాతీయ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించేలా చర్యలు తీసుకున్నారు. 2021 జూలై 30న పార్కులో గోకుల్దాస్ ఇమేజ్ కంపెనీ షెడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రెండేండ్ల వ్యవధిలోనే ఆ కంపెనీ లోదస్తుల ఉత్పత్తిని ప్రారంభించి వెయ్యి మంది మహిళలకు ఉపాధినిచ్చింది.
రెండు వేల మంది మహిళలు, యువతులకు ఉపాధి కల్పించేందు మరో దిగ్గజ రెడీమెడ్ సంస్థ ముందుకు వచ్చింది. టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ 2021లో మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో అప్పారెల్ పార్కులో 7.41 ఎకరాలలో రూ.75 కోట్లతో షెడ్ల నిర్మాణం చేపట్టింది. పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అధునాతన హంగులతో షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఆ సంస్థ ఇప్పుడు ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే రెండువేల అత్యాధునిక కుట్టు మిషన్లు, ప్రాసెసింగ్, తదితర మిషన్లు తెప్పించింది. ఇందులో టీ-షర్టులు, జీన్స్ ప్యాంట్స్ తయారు కానున్నాయి. విదేశాల నుంచి తెప్పించిన మిషన్లపై మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ అధికారులు తెలిపారు. బెంగుళూరుకు చెందిన టెక్నికల్ సిబ్బంది, కుట్టులో నైపుణ్యత కలిగిన డిజైనర్లను నియమించింది. కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన జిల్లా మహిళలకు సూపర్వైజర్లుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నది. కంపెనీకి చెందిన డైరెక్టర్లు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
అపారెల్ పార్కులో మొత్తం పదివేల మందికి ఉపాధి కల్పించాలన్నది మాజీ మంత్రి కేటీఆర్ సంకల్పం. అందులో జిల్లాకు చెందిన వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే గోకుల్దాస్ ఏర్పాటు చేసిన గ్రీన్నిడిల్ యూనిట్లో వెయ్యి మంది సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన మహిళలు, యువతులే ఉన్నారు. వీరిని కంపెనీకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సులను కంపెనీ ఏర్పాటు చేసింది. సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కులో జూకీ కుట్టు మిషన్లపై దుస్తుల తయారీలో ప్రభుత్వమే వందలాది మంది మహిళలు, యువతులకు ఉచిత శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం 3500 మంది సుశిక్షితులైన వారికి త్వరలో ప్రారంభించబోయే టెక్స్‌పోర్టు కంపెనీలో ఉపాధి కల్పించనున్నారు. మధ్యమానేరు ప్రాజెక్టు నిర్వాసితులైన యువతులు, మహిళలు, బీడీ కార్మికులకే ఉపాధి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో మహిళలు, యువతులు రానుపోను బస్సు సౌకర్యం కంపెనీలే కల్పిస్తున్నాయి. ఇంకా అనేక దిగ్గజ రెడీమేడ్ కంపెనీలు సిరిసిల్లకు రానున్నట్టు అధికారులు చెబుతున్నారు.