KTR : అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులు అర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు మగ్దూం భవన్లో ఆయన సురవరం పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తారు. నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు అయిన సురవరం మృతదేహాన్ని సీపీఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం హిమాయత్ నగర్‌లోని మగ్దూం భవన్లో ఉంచారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆదివారం (ఆగస్టు 24) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన భౌతిక కాయాన్ని సీపీఐ ప్రధాన కార్యాలయం మఖ్దూం భవన్లో (Makhdoom Bhavan) ఉంచనున్నట్లు పార్టీ వర్గాల్లు వెల్లడించాయి. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి (Gandhi Medical College) అప్పగిస్తామని తెలిపారు. అదేవిధంగా ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ నేత్రాలయానికి దానం చేస్తామని పేర్కొన్నారు.
With the passing of Comrade Suravaram Sudhakar Reddy garu, former General Secretary of the CPI and ex-MP from Nalgonda, we have lost a towering voice of the people and the Left movement.
Suravaram Garu was a lifelong fighter for the poor and a staunch supporter of the Telangana… pic.twitter.com/jPPoSbBqBv
— KTR (@KTRBRS) August 23, 2025
మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించిన సురవరం.. 1998, 2004లో రెండుసార్లు నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సీపీఐ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. చండ్ర రాజేశ్వర్‌రావు తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్రసమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సురవరం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, ఓయూ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో సుధాకర్‌రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.