KTR | అమెరికాలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచి అని తెలిపారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష అని పేర్కొన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి అవకాశాల కోసం ఎదురుచూడలేదని కేటీఆర్ తెలిపారు. అద్భుతమైన పాలసీలు తయారుచేశామని.. మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధి సాధించామని చెప్పారు. పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని కొనియాడారు. ఐటీ, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. ఐటీ ఎగుమతులు 2.72 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఐటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుందని తెలిపారు.
తమ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని కేటీఆర్ తెలిపారు. అమెజాన్ హైదరాబాద్‌లో అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆవిష్కరణలకు చిరునామాగా తెలంగాణ మారిందని చెప్పారు. ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా తెలంగాణ ఎదిగిందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఏటా 10 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదే అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలిపారు. కాళేశ్వరం ప్రాఎక్టు ద్వారా ఏటా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.