హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఒక్కో మహిళకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.లక్షా 50 వేలు బకాయి పడ్డారని.. రాష్ట్రంలోని కోటీ 67లక్షల మహిళల ఖాతాల్లో ఆ మొత్తాన్ని వేసి చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. పింఛన్లు రూ.2వేల నుంచి రూ.4వేలకు పెంచుతామని నాడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, పక్క రాష్ట్రంలో ఆయన గురువు చంద్రబాబు రూ.4వేలు పింఛన్ ఇస్తున్నారని మరి ఇక్కడ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, తులం బంగారం పత్తా లేకుండా పోయాయని, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు పెంపు, నిరుద్యోగ భృతికి డబ్బులు లేవంటూనే మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు మాత్రం లక్షన్నర కోట్లు ఎక్కడినుంచి తెస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
బీసీలకు లక్ష కోట్లు ఇస్తామని లక్ష పోట్లు
కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఏడాదికి రూ.21వేల కోట్లు చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి లక్ష పోట్లు పొడిచారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బడ్జెట్ల్లో కలిపి బీసీలకు రూ.21వేల కోట్లు కేటాయించి అందులో సైతం కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. వెయ్యి రోజుల పాలనలో బీసీ కార్పొరేషన్‌కు రూ.1,370 కోట్లు కేటాయించి రూ.74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.800 కోట్లు కేటాయించి రూ.99 లక్షలే ఖర్చు చేశారని దుయ్యబట్టారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో హడావిడి చేశారని, తమ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ బిల్లు నిలబడదని నాడే చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. 42శాతం రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్ సర్కార్ చేతిలో ఉన్న రిజర్వేషన్లను సైతం బీసీలకు ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని కాంట్రాక్టుల్లో 42శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి కేవలం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డికే అన్నీ కట్టబెడుతున్నారని ఆరోపించారు.
వృత్తి కులాలపై సర్కార్ కక్ష
వృత్తి కులాలపై ప్రభుత్వం పగపట్టిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో పింక్ రెవల్యూషన్ తీసుకొచ్చామని, జీవ సంపదలో తెలంగాణ నెంబర్ వన్‌గా అవతరించిందని గుర్తుచేశారు. గొర్రెల పంపిణీపై ఇష్టమొచ్చినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారని, ప్రస్తుతం ఆ స్కీమ్‌ను సైతం నిలిపేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చేపల పంపిణీకి సైతం ఇదే దుస్థితి ఉన్నదని గుర్తుచేశారు. చేపలు పట్టుకొనే జాతికి చెందిన శ్రీహరిని మంత్రిని చేశానని, బట్టలు ఉతుక్కొనే జాతికి చెందిన శంకర్‌ను ఎమ్మెల్యేను చేశానని రేవంత్‌రెడ్డి చెప్పడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కేసీఆర్ కట్టిన అంబేద్కర్ విగ్రహంపై కోపంతో అక్కడికి ఎవ్వరినీ వెళ్లనీయడం లేదని తెలిపారు.
కార్పొరేషన్లకు నిధులు ఎగ్గొడుతున్నరు..
ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.5,403 కోట్లు కేటాయించి రూ.74కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కేటీఆర్ చెప్పారు. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది రూ.52 కోట్లేనని తెలిపారు. అసెంబ్లీలో అట్టహాసంగా ప్రారంభించిన రాజీవ్ యువవికాసం పథకం అమలు ఎక్కడ? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని సీఎం రేవంత్ చెప్పారని, మరో సందర్భంలో ముస్లిం పిల్లలు స్కిల్డ్ లేబర్ పనికి తప్ప దేనికి పనికిరారు అంటూ హేళనగా మాట్లాడరని దుయ్యబట్టారు.
పదో తరగతి పాస్ కాని సిరాజ్‌ను డీఎస్పీని చేశానంటూ సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములను వేలం వేయాలని చూస్తే.. వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వానికి హరీశ్ రావు లేఖ రాసినట్టు కేటీఆర్ గుర్తుచేశారు. మైనారిటీలకు ఏటా రూ.4వేల కోట్ల బడ్జెట్ అని హామీ ఇచ్చి, రూ.2వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.1,360 కోట్లు కేటాయించి రూ.ఆరున్నర కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు వెల్లడించారు.

సెటిల్మెంట్లకు అడ్డాగా హైదరాబాద్
రాష్ర్టానికి ఎకనమిక్ ఇంజిన్‌గా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసి.. ముఖ్యమంత్రి నివాసాన్ని సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారని కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టి హఫ్తా ఇస్తావా? చస్తావా? అనే స్థాయికి రాష్ట్రంలో పాలన చేరినట్టు మంత్రుల కుటుంబ సభ్యులే చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో న్యాయ చిక్కుల కారణంగా 16లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే.. రాజధాని పరిసర ప్రాంతాల్లో 22ఏ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కోటీ 20లక్షలకు తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పుకూల్చిందని ఆరోపించారు. వెయ్యిరోజుల్లో ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట స్కేర్ ఫీట్‌కు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్-బీజేపీ దొందూ దొందే
రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీలు దొందూ దొందే అని కేటీఆర్ విమర్శించారు. పోక్సో నిందితులను 9రోజులపాటు అరెస్టు కాకుండా కాపాడే ప్రభుత్వం ఉన్నదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి ఘటననుద్దేశించి వ్యాఖ్యానించారు. 280 ఎకరాల మెట్రో రైలు భూములు చెరబట్టడానికి ఓ ప్రైవేట్ కంపెనీ అప్పు రూ.15వేలకోట్లను ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాయదుర్గం-శంషాబాద్ మెట్రో విస్తరణను రద్దు చేశారని చేస్తే.. ట్రాఫిక్ లేదని, ప్యాసింజర్స్ లేరనే సాకుతో లక్డీకాపూల్-పటాన్చెరు మెట్రోకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కోతలు లేవని, నేడు కాంగ్రెస్‌పాలనలో ఇన్వర్టర్లు, జనరేటర్లు వాడుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో రోజుకు ఐదు సార్లు కరెంట్ పోయే పరిస్థితి ఉన్నదని ఆరోపించారు.
ప్రశ్నిస్తే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తరా?
కార్మికులు సింగరేణి కోసం రక్తం చిందించి పనిచేస్తుంటే ఆ సంస్థపై దొంగల్లా పడి దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట సీఎం బావమరిది ఫోన్లు చేసి టెండర్లు ఫిక్స్ చేశారని తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తే నేటికీ చర్యలు లేవని నిప్పులు చెరిగారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు రూ.18వేల జీతం ఎక్కడ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో పల్లె, పట్టణ ప్రగతి చేపడితే.. దేశంలో 30శాతం అవార్డులు రాష్ర్టానికే దక్కాయని, ప్రస్తుతం పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందని విమర్శించారు.
సెక్రటేరియట్లో ధర్నాలు చేసే దుస్థితి..
అడ్మినిస్ట్రేషన్‌కు నాడీ వ్యవస్థలా ఉండే సెక్రటేరియట్లో ఉద్యోగులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. విశ్రాంత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాల జీతాలు పెంచలేదని, ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, భత్యాలు ఇవ్వడం లేదని, పీఆర్సీ రిపోర్టు ఆచూకీ లేదని మండిపడ్డారు. ఆర్టీసీని తమ హయాంలోనే విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీ విలీనానికి బ్రేక్ వేసిందని తెలిపారు. బస్సు డిపోలను ప్రైవేట్‌కు అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.