KTR | ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారావని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమా? లేదా నీ సొంత అభివృద్ధి కోసమా అని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫాంతో పోటీచేసి గెలిచాక పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా.. అధికార పార్టీకి పెద్ద ఎత్తున పలువురు నాయకులు గుడ్‌బై చెప్పి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్‌లో ఎందుకు చేరతానని కృష్ణమోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో గద్వాల ప్రచారానికి వచ్చినప్పుడు, వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెట్టానని తెలిపారు. ఆ సమయంలో కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అవసరమైతే రైలు కింద తలపెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్‌లో చేరనని అన్నాడని గుర్తుచేశారు. మరి ఇవాళ ఎవరి అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లావని కృష్ణమోహన్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసమా? ఎందుకు పార్టీ మారవని నిలదీశారు. ఈ 22 నెలల్లో గద్వాలలో ఏం అభివృద్ధి జరిగిందని అడిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గద్వాలకు కొత్తగా ఒక్క రూపాయి అయినా మంజూరయ్యిందా అని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి అరచేతిలో స్వర్గం చూపించారని అన్నారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పారని పేర్కొన్నారు. కేసీఆర్ రైతుబంధు 10 వేలు ఇస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 15 వేలు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. మరి 15 వేలు వస్తున్నాయా అని ప్రజలను ప్రశ్నించారు. రైతుబంధు 15 వేలు వస్తుందని కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారాడా అని మండిపడ్డారు. కేసీఆర్ 2 వేలు పెన్షన్ ఇస్తే.. నేను రూ.4వేలు ఇస్తానని చెప్పారని తెలిపారు. మరి 4వేల పెన్షన్ వస్తుందని పార్టీ మారాడా అని ప్రశ్నించారు. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద లక్ష రూపాయలు ఇస్తుంటే, నేను మీద నుంచి తులం బంగారం ఇస్తానని అన్నారని తెలిపారు. మరి తులం బంగారం వస్తుందా అని ప్రశ్నించారు. తులం బంగారం కోసం పార్టీ మారాడా అని ప్రశ్నించారు.
ఆడబిడ్డలకు రూ.2500లు ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని కేటీఆర్ గుర్తుచేశారు. అత్తకు రూ.4వేలు, కోడలికి రూ.2500 ఇస్తానని మాట ఇచ్చారని అన్నారు. ఏ ఆడబిడ్డకు అయినా రూ.2500 వచ్చాయా అని ప్రశ్నించారు. 1.67 కోట్ల మంది రూ.2500 కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారని తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పారని.. మరి రుణమాఫీ అయ్యిందా అని ప్రశ్నించారు. రుణమాఫీ అయ్యిందని ఎమ్మెల్యే పార్టీ మారాడా అని అడిగారు. ఇప్పుడు మీడియా అడిగితే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని కృష్ణమోహన్ రెడ్డి చెప్పడం సిగ్గులేని విషయమని మండిపడ్డారు. మరి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుంటే.. బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడ అవుతుంటే.. ఎక్కడ ఉన్నావని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
బీఆర్ఎస్ మీటింగ్ అవుతుంటే.. ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సంకల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి దగ్గర ఉండి.. బీఆర్ఎస్లోనే ఉన్నానని సన్నాయి నొక్కులు నొక్కితే ఎవరు నమ్ముతారని అన్నారు. ఆయనకు సిగ్గులేకపోయినా.. మనకైనా సిగ్గు ఉండాలన్నారు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. సుప్రీంకోర్టు మాత్రం సీరియస్‌గా ఉందని అన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకతప్పదు.. ఉప ఎన్నిక రాక తప్పదని స్పష్టం చేశారు.
వచ్చే ఆరు నుంచి 9 నెలల్లో ఇదే గద్వాలలో తిరిగి ఉప ఎన్నిక వస్తుందని కేటీఆర్ తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. పెద్దనాయకులు పార్టీని వదిలిపెట్టినప్పటికీ చాలామంది ఇక్కడే ఉన్నారని తెలిపారు. బలమైన సర్పం కూడా చలిచీమల చేతచిక్కి సచ్చినట్లు.. ఇవాళ బలవంతుడిగా కనిపించే ఎమ్మెల్యే గానీ.. కాంగ్రెస్ గానీ.. మీ దెబ్బకు దిగిరాక తప్పదని అన్నారు. గద్వాలలో జోష్ చూస్తుంటే.. ఉప ఎన్నిక రావడం ఖాయం.. అందులో 50 వేల మెజారిటీతో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.