ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్ణయాల ఫలితంగా హైదరాబాద్ ఇప్పుడు అమెజాన్, ఇతర ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీల అతిపెద్ద క్యాంపస్‌లకు నిలయంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ-హబ్ వేలాది స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నది. ప్రపంచంలో మూడో వంతు టీకాలను ఉత్పత్తి చేస్తూ తెలంగాణ గ్లోబల్ ఫార్మాస్యుటికల్ హబ్‌గా నిలిచింది.
-కేటీఆర్
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో అంతర్జాతీయ వేదికపై స్పష్టంచేశారు. లక్షలాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసాను కల్పించిన విజయగాథ తెలంగాణ అని చాటిచెప్పారు. ప్రజల జీవితాలను మార్చాలనే సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం సాధించవచ్చో చూపించడానికి తెలంగాణ రాష్ట్రం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం’ సదస్సులో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విజయాన్ని కేవలం అంకెలతోనే కాకుండా ఆత్మగౌరవానికి, పట్టుదలకు ప్రతిరూపంగా చూడాలని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతితకువ కాలంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఎదిగిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ప్రపంచలోనే అతిపెద్ద ఐదు దిగ్గజ టెక్ కంపెనీల ఆఫీసులకు తెలంగాణ కేరాఫ్‌గా నిలిచిందన్నారు. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ మాదిరిగా కేసీఆర్ ఎఫెక్ట్ పనిచేసిందని చెప్పారు. స్వతంత్ర భారతచరిత్రలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.75 వేల కోట్లు జమచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. దేశంలో కోటి ఇండ్లకు రక్షిత తాగునీటిని అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రపంచానికి భవిష్యత్తు భారత్ అని, తెలంగాణ తన విజయ ప్రస్థానాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరిస్తున్నదని భరోసా ఇచ్చారు.
భారతదేశంలోని 65 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారు. అందుకే మేం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా దాదాపు రూ.75 వేల కోట్లు జమచేసిన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎకడా లేదు. మేం తీసుకొచ్చిన ఈ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చింది.
-కేటీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ‘2015 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం నాలుగేండ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశాం. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ అమెరికా అవతల హైదరాబాద్‌లోనే ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీహబ్ హైదరాబాద్‌లో ఉన్నది. ప్రపంచంలోని మూడో వంతు వ్యాక్సిన్ ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద దిగ్గజ టెక్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటుచేశాయి. ఐటీ రంగ ఉద్యోగ కల్పనల్లో వరుసగా రెండేండ్లపాటు బెంగళూరును హైదరాబాద్ దాటేసింది. కొత్త రాష్ట్రంగా శిథిలాల నుంచి గెలుపు సౌధాలను తెలంగాణ నిర్మించింది. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో తెలంగాణ రాష్ట్రంగా నూతన ప్రయాణాన్ని మొదలుపెట్టాం.మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 రోజుల్లో అనుమతులు వచ్చేలా చేశాం. ఒకవేళ 15 రోజులలోపు అనుమతులు రాకపోతే ఆ పరిశ్రమను ప్రారంభించుకోవచ్చు. దేశంలోని ఏ రాష్ట్రం లో ఇలాంటి అవకాశం లేదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం యాదృచ్ఛికంగా ఏర్పడలేదని, దశాబ్దాల శాంతియుత, ప్రజాస్వామ్య పోరాట ఫలితమని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ స్వపరిపాలనలో వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా అసాధారణ ఫలితాలను ఖాతాలో వేసుకున్నదని పేర్కొన్నారు. ‘దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడింది. అహింసాయుతంగా జరిగిన ఒక మహాద్భుత పోరాటం తెలంగాణ ఉద్యమం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో అద్భుతమైన ఆర్థిక పురోగతిని, ప్రగతిని చూపించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. తెలంగాణ విజయాన్ని అంకెలతో మాత్రమే చెప్పుకుంటే సరిపోదు. ఆత్మగౌరవం, పట్టుదలకు ప్రతిరూపంగా చెప్పుకోవాలి. లక్షలాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసాను ఇచ్చిన విజయగాథలాగా తెలంగాణను చూడాలి. సబ్బండవర్గాల భాగస్వామ్యంతో సాధించిన సమ్మిళిత వృద్ధిలాగా తెలంగాణ విజయాన్ని చెప్పుకోవచ్చు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో వ్యక్తుల కంటే విధానాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కేటీఆర్ గుర్తుచేశారు. ‘భారతదేశంలోని 65 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారు. అందుకే మేం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా దాదాపు రూ.75 వేల కోట్లు జమచేసిన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎకడా లేదు. మేం తీసుకొచ్చిన ఈ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చింది. అందుకే 2014లో ధాన్యం ఉత్పత్తిలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ పంజాబ్, హర్యానాను దాటి 2022 నాటికి నంబర్‌వన్‌కు చేరింది. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్పుకున్నట్టే.. కేసీఆర్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పుకోవాలి.
ప్రజల జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అనడానికి తెలంగాణ విజయగాథనే నిదర్శనం. దేశంలో కోటి ఇండ్లకు శుద్ధి చేసిన తాగునీటిని అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 80 మీటర్ల సముద్రమట్టం నుంచి 618 మీటర్లకు నీటిని తీసుకెళ్లే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం నాలుగేండ్లలోనే పూర్తిచేసింది. ఇన్‌ల్యాండ్ ఫిషరీస్‌లో తెలంగాణ నంబర్‌వన్ స్థానానికి ఎదిగింది. ఫ్లోరోసిస్ నిర్మూళన జరిగింది. పారిశ్రామిక అవసరాల కోసం తగినంత నీటిని అందుబాటులో ఉంచిన రాష్ట్రం తెలంగాణ. హైదరాబాద్ లాంటి నగరానికి నీటి సమస్యలు లేకుండా శాశ్వత పరిషారాన్ని కేసీఆర్ చూపించారు’ అని కేటీఆర్ వివరించారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రతినిధిగా తాను వచ్చానని, కలిసి పనిచేస్తే అద్భుతాలు చేయవచ్చన్నారు. ప్రపంచానికి భారతే భవిష్యత్తు అని, తెలంగాణ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నా తండ్రి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. యువత కలిసి రావాలని, ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2006లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి, నా తండ్రి నేతృత్వంలోని ఉద్యమంలో చేరాను. నా ప్రయాణంలో ఉద్యమకారుడిగా, అధికారంలో, ప్రతిపక్షంలో ఇలా ఎక్కడ ఉన్నా నాకు సంతృప్తి ఇచ్చింది.
-కేటీఆర్
దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడింది. అహింసాయుతంగా జరిగిన ఒక మహాద్భుత పోరాటం తెలంగాణ ఉద్యమం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో అద్భుతమైన ఆర్థిక పురోగతిని, ప్రగతిని చూపించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. తెలంగాణ విజయాన్ని అంకెలతో మాత్రమే చెప్పుకుంటే సరిపోదు. ఆత్మగౌరవం, పట్టుదలకు ప్రతిరూపంగా చెప్పుకోవాలి.
-కేటీఆర్
ఉపన్యాసం అనంతరం ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ మాయా ట్యూడర్‌తో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెతోపాటు సభికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎలా వచ్చారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నా తండ్రి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. యువత కలిసి రావాలని, ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయనను చూసి నేను స్ఫూర్తి పొందాను.
2006లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి, నా తండ్రి నేతృత్వంలోని ఉద్యమంలో చేరాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నా ప్రయాణంలో ఉద్యమకారుడిగా, అధికారంలో, ప్రతిపక్షంలో ఇలా ఎక్కడ ఉన్నా నాకు సంతృప్తి ఇచ్చింది’ అని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్ వివరంగా సమాధానం ఇచ్చారు. ఎవరికీ నష్టం కలగకుండా జీడీపీ ప్రతిపాదికన పునర్విభజన జరపాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. దీనికి ఉత్తరాది రాష్ర్టాలు ఒప్పుకోకపోయినా, తాము వాయిస్‌ను వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
పాలనాపరంగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే రెండు అంశాలను వివరించాలని కోరగా.. ‘ఆర్థిక అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని కొనసాగించడమే నా ప్రాధాన్యత’ అని కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఉద్యోగాలు, సంపదను సృష్టించాలని, దానిని సమాజంలో అవసరమైనవారికి పంచిపెట్టడం ద్వారా వారి అభివృద్ధికి బాటలు వేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇక.. దేశ రాజకీయాల్లో మహిళల పాత్రపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇస్తూ ‘రాజకీయాల్లో 40 శాతం సీట్లు మహిళలకు ఇస్తే అద్భుతాలు చేయగలుగుతారు’ అని అభిప్రాయపడ్డారు. రాబోయే భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే అవకాశమున్నదన్నారు. తనకు ఇప్పుడు 48 ఏండ్లు అని, ఇంకో 25 ఏండ్లు ఆరోగ్యంగా ఉంటానని భావించినా, అప్పటిలోగా రాజకీయాల్లో మహిళా సాధికారతను చూస్తానన్న నమ్మకం తనకు ఉన్నదన్నారు.
రైతుబంధు విజయవంతమైందా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘మేము ఈ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నప్పుడు రెండు రకాల వాదనలు వినిపించాయి. ఒకటి.. రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వకుండా విత్తనాలు, ఎరువుల సబ్సిడీ తదితర మార్గాల్లో అందించాలని సూచనలు వచ్చాయి. రెండోది రైతులకు నేరుగా డబ్బులు ఇచ్చి, వాటిని ఎలా ఖర్చు చేయాలన్నది వారికే వదిలేయాలని మరికొందరు చెప్పారు. అందుకే మేం ప్రజలను నమ్మాం. రైతుబంధుతో మేం అనుకన్నది సాధ్యమైంది. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సుమారు 9 బిలియన్ డాలర్ల డబ్బు జమచేశాం. ఫలితంగా ఒకప్పుడు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన చోటే ఇప్పుడు 3 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతున్నది. తలసరి ఆదాయంలో 14వ స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.