KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సింహాం లాంటోడు.. సింగిల్గానే వస్తాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ జలవిహార్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఒక బక్క పలుచని కేసీఆర్.. ఆయన ఉన్నదే 52 కిలోలు.. ఆయనను ఢీకొట్టేందుకు అందరూ ఒక్కటైతున్నారు. కేసీఆర్ను ఓడించడమే నా జీవిత లక్ష్యమని షర్మిల ప్రకటించారు. అందుకే నేను తప్పుకుంటున్నా కాంగ్రెస్కు ఓటేయండి అని షర్మిల స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక చాలా మంది ఒక్కటి అవుతున్నారు. ఇవాళ ఒక్కటి మాత్రం పక్కా.. 2014లో ఎవర్నీ నమ్ముకోలేదు.. ప్రజలను నమ్ముకున్నాం. 2018లో కూడా ఎవర్నీ నమ్ముకోలేదు. ప్రజలనే నమ్ముకున్నాం. 2023లో కూడా ప్రజలన్ని నమ్ముకుంటున్నాం. మిమ్మల్ని మన్ముకుంటున్నాం. సినిమా డైలాగ్ చెప్పాలంటే.. సింహాం ఎప్పుడూ సింగిల్గానే వస్తది. కేసీఆర్ సింహాం లాంటోడు.. సింగిల్గానే వస్తడు.. మాకు విశ్వాసం ఉంది. మీ మీద, ప్రజల మీద విశ్వాసం ఉంది. మా పని మీద మాకు విశ్వాసం ఉంది. పని చేశాం కాబట్టి బరాబర్ ఓట్లు అడుగుతాం. తప్పేముంది అని కేటీఆర్ అన్నారు.
న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన వాడు.. కరోనా సమయంలో కాపాడుకున్నవాడు. 250 మంది అడ్వకేట్లకు సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరి మీదనో ఆధారపడి ఎందుకు ఉండాలి. మోదీ, అమిత్ షా, 16 మంది ముఖ్యమంత్రులు, ఇక కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ అంత మంది వస్తున్నరు మా మీదికి. కేసీఆర్ మన నాయకుడు.. కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే ఈ తెలంగాణ సురక్షితంగా ఉంటుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు ధీటుగా అడ్వకేట్లు పని చేశారు. ఉస్మానియా గేట్లను బద్దలుగొట్టి విద్యార్థులకు మద్దతు తెలిపింది న్యాయవాదులే. ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి కేసీఆర్ పిలుపునిస్తే బారికేడ్లు ఎక్కి పోరాటం చేశారు. కొన్ని అనుభవాలు మరిచిపోలేనివి. ఉద్యమంలో భాగంగా సాయంత్రం రైల్ రోకో తర్వాత మౌలాలిలో అరెస్టు చేస్తే, రాత్రి ఒంటి గంటకు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు, తార్నాక ప్రాంగణంలోని రైల్వే జడ్జి వద్దకు తీసుకెళ్లారు. ఫైనల్గా ఉద్యమ వేడికి జడిసి ఆ న్యాయమూర్తి అన్యాయం చేయకుండా న్యాయం చేసి బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించాడు. తెలంగాణ ఉద్యమంలో మాకు మనోస్థైర్యం ఇచ్చారు. న్యాయస్థానాల్లో ఒక్క పైసా ఆశించకుండా మాకు అండగా నిలబడ్డ న్యాయవాదులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.