KTR | హైదరాబాద్, జనవరి 17 (నమస్తేతెలంగాణ): రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున ఖాతాల్లో వేయకుండా, 4 వేలకు పింఛన్ పెంచకుండా స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టుకొని అడగాలని, ఆరు గ్యారెంటీలు ఏడికిపోయినవని నిలదీయాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీని కూడా అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి, ఢిల్లీకి వెళ్లి అక్కడ గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత తనదని చెప్పడం ఈ ఏడాది పెద్దజోక్ అని ఎద్దేవాచేశారు.
‘తల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పిన చందంగా రేవంత్ వైఖరి ఉన్నది.. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తనని చెప్తే తెలంగాణలో నమ్మేవాళ్లేవరూ లేరు’అని దెప్పిపొడిచారు. ‘కేసీఆర్ పాలనలో నాట్లు వేసేటప్పుడే రైతుబంధు పైసలు పడితే.. కాంగ్రెస్ పాలనలో ఓట్లప్పుడే పడతయి’ అంటూ నిష్ఠూరమాడారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతుధర్నాకు కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, పటోళ్ల కార్తీక్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు నిస్సిగ్గుగా మాటలు మారుస్తున్నాడని దుయ్యబట్టారు.
రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం, మంత్రులు అంతా అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏ ఊరిలోనైనా రైతులందరి రుణాలు మాఫీ అయినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేందరితో రాజీనామా చేయిస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు తన సవాల్‌ను స్వీకరించాలని, లేదంటే రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాలను చూసి అన్ని వర్గాలు భగ్గుమంటున్నాయని నిప్పులు చెరిగారు. రెండు వేల పింఛన్లు 4వేలు చేస్తనని ముసలోళ్లను కూడా మోసం చేసిన ఘనుడు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. మూడు పంటలకు రైతుభరోసా ఇస్తామని చెప్పి ఉన్నది కూడా ఎగ్గొట్టారని విరుచుకుపడ్డారు.
రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం ఏడాదికి రూ.15 వేల రైతుభరోసా, యాసంగికి ఎగ్గొట్టిన రూ.2500తో కలిపి మొత్తం ఎకరా ఉన్న రైతుకు రూ.17,500 బాకీ పడ్డాడని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని కోటీ అరవై లక్షల మంది ఆడబిడ్డలకు మహాలక్ష్మి కింద రూ.30 వేలు, ఏడాదిలో పెండ్లి చేసుకున్న 5 లక్షల మంది ఆడబిడ్డలకు తులం బంగారం చొప్పున బాకీ పడ్డారని తెలిపారు.
సర్పంచ్ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను తమ బాకీ తీర్చాలని ప్రజలు నిలదీయాలని సూచించారు. మొహమాటపడి ఓటేస్తే రైతుభరోసా మాయమవుతుందని, ఉన్న ఫ్రీ బస్సు తుస్సుమంటుందని చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ స్కీంలను ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయిన చందంగా ప్రజల పరిస్థితి మారిందని వాపోయారు. ఓట్ల కోసం కాంగ్రెస్ తెచ్చిన అభయహస్తం.. భస్మాసుర హస్తంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు రానున్నాయని కేటీఆర్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్నికలు అనివార్యమని పేర్కొన్నారు. కేసీఆర్బొమ్మతో చేవెళ్ల లో గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధికోసం పార్టీ మా రానని చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. రానున్న ఉప ఎన్నికల్లో ఆయనకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదన్న పాపానికి లగచర్ల రైతులను ప్రభుత్వం చిత్రహింసలు పెట్టిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి గిరిజన గూడేలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసిందని విమర్శించారు. జైలులో గుండెపోటుతో బాధపడుతున్న రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేసి హాస్పిటల్‌కు తీసుకెళ్లడం సర్కారు దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అమాయక రైతులతో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని జైల్లో పెట్టిన కాంగ్రెస్ సర్కారుకు ఓటుతో బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. ఉద్యమ నేపథ్యం కలిగిన బీఆర్ఎస్కు కేసులు, జైళ్లు కొత్తకాదని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్‌ను వదిలి పెట్టేది లేదని తేల్చిచెప్పారు.
షాబాద్ రైతుధర్నాకు వచ్చిన కేటీఆర్‌కు బీఆర్ఎస్ నేత నవీన్‌రెడ్డి నాయకత్వంలో అడుగడుగునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ స్థానిక నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కేటీఆర్‌ను సాదరంగా ఆహ్వానించారు. డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ వేదికవద్దకు తీసుకొచ్చారు. దారిపొడవునా జేసీబీల పైనుంచి గులాబీల వర్షం కురిపించారు.
కేసీఆరే సార్..ఆయన ఉన్నప్పుడు నెలనెలా ఖాతాల పడుతుండె..రేవంత్ అచ్చినంక నాలుగు వేలు ఇస్తనని చెప్పి మోసం చేసిండు.. ఉన్న పింఛన్ పైసలు సుత సక్కగ ఇస్తలేడు. 500 గ్యాస్ ఇస్తమని చెప్పి, 900 తీసుకుంటుండ్రు. 400 బ్యాంకులో వేస్తమని చెప్పి మాటెత్తుతలేరు. నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. ఇప్పటికి రైతుబంధు పైసలు పడలే. అటు రుణమాఫీ కాక, ఇటు రైతుబంధు రాక ఇబ్బంది పడుతున్నం. 4 వేలు పింఛన్ ఇస్తమని చెప్పి ఇప్పటికి ఇయ్యలేదు. కేసీఆర్ సారు ఇచ్చిన 2 వేలే ఇస్తుండ్రు. అవీ సరిగ్గ పడుతలేవు. 4 వేలు ఇస్తనన్న రేవంత్‌రెడ్డి పత్తాలేడు. ఆయన పాలన వచ్చినంక ఏం మంచిగ లేదు. రేవంత్‌రెడ్డి మాటలు విని మోసపోయినం సారూ.. ఈ సారి మాత్రం కేసీఆర్‌నే గెలిపిస్తం..
రైతులందరికీ రుణమాఫీ చేసినమని సీఎంతో పాటు మంత్రులు కూడా అబద్ధాలు చెప్తున్నరు. సీఎం రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెతో పాటు రాష్ట్రంలోని ఏ ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేందరితో రాజీనామా చేయిస్తా.. కాంగ్రెస్ నేతలు నా సవాల్‌ను స్వీకరించాలి. లేదంటే రైతులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.
-కేటీఆర్
అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు నిస్సిగ్గుగా మాటలు మారుస్తున్నడు. నిత్యం అబద్ధాలు చెప్తూ ప్రజలను ఏమారుస్తున్నడు. రాష్ట్రంలో ఎవరిమీదైనా చీటింగ్ కేసు పెట్టాలంటే మొదట రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీపైనే నమోదు చేయాలి.
-కేటీఆర్
‘మీ అందరికీ సుపరిచితుడు..యువ నాయకుడు మీకు కాబోయే ఎమ్మెల్యే పటోళ్ల కార్తీక్‌రెడ్డి’ అని కేటీఆర్ వేదికపై ప్రకటించారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో చేవెళ్లనుంచి తప్పకుండా విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. దీంతో సభకు హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. ‘కార్తీక్‌రెడ్డి జిందాబాద్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేటీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తంచేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ముమ్మాటికీ కార్తీక్‌రెడ్డి విజయం సాధించి ఎమ్మెల్యే అవుతారని పేర్కొన్నారు.
సార్ నా పేరు జక్కని రుక్కమ్మ. మాది లింగారెడ్డిగూడ. షాబాద్ మండలం. మా ఊరికి బస్సు లేక తిప్పలు వడ్తున్నం. మాలాంటి ముసలోళ్లు నడుచుకుంట పోవాల్నంటే చాన ఇబ్బంది అయితాంది. బస్సు వేయిండ్రని ఎంతమందికి చెప్పినా పట్టించుకుంటలేరు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగుండె. మల్ల ఆ సారే రావాలె. నేను ఆయనకే ఓటేస్త.
– జక్కని రుక్కమ్మ, లింగారెడ్డిగూడ
‘తెలంగాణలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు గాని, ఇక ఢిల్లీలో గ్యారెంటీలు అమలు చేస్తావా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి ఇప్పుడు ఢిల్లీ పురవీధుల్లో రేవంత్ కొత్త నాటకం మొదలు పెట్టారని శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీలను అమలు చేశామని చెప్తూ రేవంత్‌రెడ్డి ఢిల్లీ ప్రజలనూ మోసం చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన ఢిల్లీలో కూడా చేయిస్తానని పులకేశి బయలుదేరారని ఎద్దేవాచేశారు. ‘ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ? నెలకు రూ.2500 అందుకుంటున్న మహిళలు ఎవరు? తులంబంగారం అందిన ఆడబిడ్డలు ఎవరు? రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెకడ ? ఆసరా పింఛన్లు రూ.4000 చేసిందెకడ? రూ.5 లక్షల విద్యాభరోసా ఎకడ? విద్యార్థినులకు ఎలక్ట్రిక్ సూటీలు ఏవీ? పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా ఇకడ హామీలకు దికులేదు గాని, ఢిల్లీ ప్రజలకు గ్యారెంటీలు ఇస్తున్నవా?’ అని నిప్పులు చెరిగారు. ‘ఢిల్లీ గల్లీల్లో కాదు.. మీ ఢిల్లీ పెద్దలతో కలిసి అశోక్‌నగర్ గల్లీల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పు’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.