హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు, ఆందోళనలే స్పష్టం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ సత్తుపల్లి మున్సిపాలిటీ నేతలతో సమావేశమయ్యారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం గడువు కొద్దిరోజుల్లో ముగుస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలపై గ్రామసభల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారని, ఆగ్రహంతో సభ టెంట్లను ఎక్కడికక్కడ పీకేయడం, అధికారులను అడ్డుకోవడం చూస్తుంటే ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో తెలుస్తున్నదని వాపోయారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయకేతనం ఎగురవేస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రోత్సాహంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాను ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు 17 మంది సత్తుపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లను కేటీఆర్ సన్మానించారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందితే ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా 17 మంది పార్టీలోనే కొనసాగడం హర్షణీయమని కొనియాడారు.
ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలపునిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే సమావేశమవుతారని హామీ ఇచ్చారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించామని, గత ప్రభుత్వాలకంటే వంద రెట్లు ఎక్కువ పురోగతి సాధించామని వెల్లడించారు.
గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీలకు అధిక నిధులు కేటాయించి అన్ని సౌకర్యాలు కల్పించామని గుర్తు చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అంతా తారుమారైందని విమర్శించారు. ఇప్పటి దాకా పల్లెలు, పట్టణాలు, మున్సిపాలిటీల కోసం ఏ ఒక్క పథకాన్నీ కాంగ్రెస్ అమలు చేయలేదని చెప్పారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేశ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.