హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, రేవంత్‌రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని మూడు రోజుల కిందట కర్ణాటక మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం 100 టీఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని, కృష్ణా జలాల్లో తెలంగాణ హకును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలను ఎడారులుగా మార్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. ఈ కుట్రపై రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను వెంటనే అడ్డుకోకపోతే రైతులతో కలిసి మహోద్యమాన్ని నిర్మిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకూ పనికిరాకుండా పోతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయినా ఈ పథకం నిర్వీర్యమవుతుంటే పాలమూరు బిడ్డగా చెప్పుకొనే రేవంత్ చూస్తూ ఊరుకోవడం దారుణమని మండిపడ్డారు. కర్ణాటక నుంచి కృష్ణా నీళ్లు రాకపోతే జూరాల ప్రాజెక్టే నిండదని, రేవంత్ మొదలుపెట్టిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా పడావు పడుతుందని హెచ్చరించారు.
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని కేటీఆర్ గుర్తుచేశారు. 2013లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్-II ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందని తెలిపారు.ఎత్తు పెంపుతో మన రైతుల హకులు దెబ్బతింటాయని వాదించి స్టే తెచ్చిందని పేర్కొన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కూడా ఈ పోరాటాన్ని కొనసాగించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఆ స్టే కొనసాగేలా చేశారని గుర్తుచేశారు.
కర్ణాటక నిర్ణయంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ వెంటనే సుప్రీంకు వెళ్తామని ప్రకటించారని, కానీ రేవంత్ ఇంకా మొద్దునిద్ర వీడలేదని కేటీఆర్ విమర్శించారు. మహారాష్ట్ర మద్దతు కూడగట్టుకుని సుప్రీంలో పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నదని గుర్తుచేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేసీఆర్ పక రాష్ర్టాల సీఎంలతో స్వయంగా మాట్లాడి, అభ్యంతరాలను తొలగించి పూర్తిచేశారని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలన్న చిత్తశుద్ధి రేవంత్‌కు లేకపోవడం ఇకడి ప్రజల దురదృష్టమని వాపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి గోదావరి జలాలను ఏపీకి ధారాధత్తం చేస్తున్న రేవంత్‌రెడి, ఇప్పుడు కృష్ణా జలాలను కర్ణాటకకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నదులపై హకులను కాలరాస్తున్న జలదోపిడీకి వ్యతిరేకంగా మహోద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.
ఓట్చోరీపై గొంతు చించుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణలో ఆ పార్టీ చేసిన ఎమ్మెల్యేల చోరీపై ఏం సమాధానం చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల చోరీ ఒక నేరమైతే, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను దొంగిలించడం అంతకంటే పెద్ద నేరమని, అది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి సిగ్గూశరం ఉంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొన్న ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల దొంగతనం గురించి రాహుల్‌గాంధీ ఉపన్యాసాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. కానీ, తెలంగాణలో ఆయన పార్టీ చేస్తున్న ఎమ్మెల్యేల దొంగతనం కనిపించకపోవడం, కాంగ్రెస్ డీఎన్ఏలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలకు, రాహుల్ రెండు నాలల ధోరణికి నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ సిద్ధాంతాలు కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించి తెలంగాణ ప్రజలు గెలిపించిన పది మంది ఎమ్మెల్యేలను అధికార మదంతో డబ్బును ఎరగా చూపి కాంగ్రెస్‌లో చేర్చుకోవడం అనైతికం, సిగ్గుమాలిన చర్య కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజా తీర్పును కాలరాసి కాంగ్రెస్ చేసిన సిగ్గుమాలిన చర్య ఓట్లను దొంగిలించడం కంటే ఘోరమైన నేరమని మండిపడ్డారు. ఓట్చోరీ గురించి మాట్లాడే ముందు, తెలంగాణలో కాంగ్రెస్ చేసిన ఎమ్మెల్యేల చోరీపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసి సంతలో పశువుల్లా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తీరుపై భారత్ జోడో న్యాయ్ యాత్ర చేసిన రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దమ్ము, ధైర్యం ఉంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని,ఎవరి బలం ఏంటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా రాహుల్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, సరైన సమయంలో ఆ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఆల్మట్టి ఎత్తు పెంపు ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలను కేటీఆర్ తిప్పికొట్టారు. కేవలం 5 అడుగుల ఎత్తు పెంచేందుకు అవసరమైన భూసేకరణ కోసమే రూ.70 వేల కోట్లు ఖర్చు చేయడంతోపాటు లక్షా 30 వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించిందని తెలిపారు. మరి 5 అడుగుల భూసేకరణకే అంత ఖర్చయితే, 3 బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 1700 కిలోమీటర్ల కాలువలు.. 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్ల ఖర్చులో తప్పేమున్నదని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో ఆరు దశాబ్దాలపాటు నీటివాటాలో జరిగిన అన్యాయాన్ని సరిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవధార అని పునరుద్ఘాటించారు. తెలంగాణకు కల్పతరువు, కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు చిల్లర, డొల్ల, దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.