అజ్ఞానం.. అరాచకం.. అవినీతి.. అబద్ధం.. అనే నాలుగు తలలతో బుసకొడ్తున్న అనుముల నాగుపాము పాలన ఇది! వెయ్యి రోజులుగా రైతులను రాచిరంపాన పెడ్తున్న రాక్షస పాలన ఇది! నిరుద్యోగులను నిండాముంచిన, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన, విద్యార్థులకు విషం పెట్టిన పరమ నికృష్ట పాలన ఇది! కేసీఆర్ మాటలో చెప్పాలంటే అన్ని రంగాలను భ్రష్టు పట్టించిన సర్వభ్రష్ట ప్రభుత్వమిది!
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన పేరిట అన్ని వర్గాలను పీడిస్తూ, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన.. రాష్ట్ర ప్రజలకు అంతులేని వేదనను మిగిల్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 6 గ్యారెంటీలకు ఘోరీ కట్టి, 13 డిక్లరేషన్లకు పాతరేసి, 420 హామీలకు మంగళంపాడి.. తొండి మాటలు, మొండి చేతు లు, శిఖండి పాలనతో ప్రజానీకాన్ని వంచిస్తున్నదని ఆయన మండిపడ్డారు.
‘2023 డిసెంబర్7న మొదలైన దండయాత్ర నేటికి వెయ్యి రోజులైంది, ఈ వెయ్యి రోజులు క్రిమినల్ వేస్ట్.. ఈ ప్రభుత్వానికి జీరో వ్యాల్యూ.. ఆర్థిక విధ్వంసం, సామాజిక సంక్షోభం, సాంస్కృతిక విద్రోహం తప్ప జరిగిందేమీ లేదు.. అన్నిరంగాల్లో అట్టర్‌ఫ్లాప్ అయి భ్రష్టు పట్టించిన వరస్ట్ ప్రభుత్వమిది’ అని నిప్పులుచెరిగారు. బుధవారం తెలంగాణ భవన్లో కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై కేటీఆర్ చార్జ్‌షీట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభయహస్తం.. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అని విమర్శించారు.
ఇండ్లు కూల్చుడు.. భూములు కొల్లగొట్టుడు
కాంగ్రెస్ పాలనలో హైడ్రా పేరుతో అరాచకం సాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అనుముల అనుయాయులు, అన్నదమ్ములు, పొంగులేటి తాబేదార్లు భూములు, వనరులను కొల్లగొడుతున్నారని, 22-ఏ పేరుతో కోట్లాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను హింసిస్తున్నారని విరుచుకుపడ్డారు.
సగం రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నరు
రుణమాఫీ చేస్తామని, మూడు పంటలకు రైతుభరోసా ఇస్తామని అన్నదాతను నమ్మించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీరని ద్రోహం చేస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘మొదట రూ.50వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు.. 15 రోజుల తర్వాత 41వేల కోట్లకు తగ్గించారు.. క్యాబినెట్‌కు వచ్చేసరికి రూ.31వేల కోట్లకు కుదించారు.. బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి రూ.26 వేల కోట్లు చేశారు.. చివరకు కేవలం రూ.20 వేల కోట్లు మాఫీ చేసి చేతులు దులుపుకొన్నారు.. రూ. 2లక్షలకు పైగా రుణాలు మాఫీ చేస్తామని నమ్మించారు..మిత్తికట్టిన తర్వాత కుచ్చుటోపీ పెట్టారు.. వెరసీ 70 లక్షల రైతులను ఆగం చేశారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తేరుకున్న ఎవుసాన్ని తెర్లు చేశారు..
పదేండ్ల కేసీఆర్ పాలనలో తేరుకున్న ఎవుసాన్ని మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో తెర్లు చేశారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ నాయకత్వంలో దేశానికే అన్నంపెట్టేస్థాయికి ఎదిగిన తెలంగాణను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ గద్దెనెక్కిన తర్వాత మొండిచేయి చూపారని మండిపడ్డారు. లగచర్లలో హీర్యానాయక్ అనే రైతుకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని మండిపడ్డారు. ధాన్యం కొనే దిక్కులేక రైతన్నలు గుండె పగిలి ధాన్య కుప్పలపైనే ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వయంగా నర్సంపేటకు తీసుకెళ్లి మక్క రైతుల కష్టాలను చూపెట్టారని గుర్తుచేశారు. వెయ్యి రోజుల్లో వెయ్యికి పైచిలుకు అన్నదాతల ఆత్మహత్యలే కాంగ్రెస్సోళ్లు సాధించిన అతిపెద్ద విజయం అని చురక లంటించారు.

ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలన్నరు.. 100 రోజుల్లో 6 గ్యారెంటీలన్నరు.. వెయ్యి రోజులైనా అతీగతీలేవు. మొన్న వేల మంది ఉద్యోగులు సెక్రటేరియట్ బయట ఆందోళన చేసిండ్రు. విఫల పాలనకు అంతకంటే నిదర్శనం ఏముంటది? ఉద్యోగులకు ఉత్త చేతులు చూపిండ్రు. దళిత బహుజనులను మోసం చేసిండ్రు. మైనారిటీలకు ధోకా ఇచ్చిండ్రు. జెన్‌జీకి అర్థమయ్యేలా చెప్పాలంటే రేవంత్ పాలనలో అసమర్థత ప్రో మ్యాక్స్.. అవినీతి అల్ట్రామ్యాక్స్.. అరాచకం ఐమాక్స్..
– కేటీఆర్
రేవంత్‌రెడ్డి సీఎం కాదు.. రక్తపిశాచి
కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలని అడిగిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను దూషించడం తప్ప ఉద్ధరించిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నా సోయిరాలేదు.. గోదావరి, కృష్ణా నీళ్లను కిందికి వదిలి తన గురువుకు దక్షిణ చెల్లించుకున్నారు’ అని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు నీళ్లడిగితే రక్తం చల్లండని చెప్పిన రక్తపిశాచి రేవంత్‌రెడ్డి.. నీరు పారాల్సిన చోట నెత్తురు పారించే వాడు నేరగాడా? పాలకుడా? అని నిలదీశారు.
రైతుబంధు బంద్.. రాహుల్ బంద్ షురూ
కేసీఆర్ పాలనలో రైతులకు రూ.5 లక్షల బీమా ఇచ్చి ధీమా ఇచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీమా లేదు.. ధీమా లేదని విమర్శించారు. ‘ఉద్దెర హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతుబీమాను చిదిమేసింది.. రైతుభరోసా ఎగ్గొట్టింది.. రుణమాఫీకి కోత పెట్టింది.. సన్నాల పేరిట బోనస్‌ను బోగస్ చేసింది. మొత్తంగా రైతుబంధును బంద్ చేసింది..రాహుల్ బంధును చాల్ చేసింది.. అన్నదాతల జేబులు కొట్టి రాహుల్ జేబులు నింపుతున్నరు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నాడు తల తెగిపడ్డా మోటర్లకు మీటర్లు పెట్టనివ్వనని కేసీఆర్ తేల్చిచెప్పారు. కానీ నేడు రైతు డిస్కమ్ పేరిట కుట్రలు చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.
కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష
కేసీఆర్ పాలనలో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నీళ్లున్నా ఎత్తిపోయకుండా రైతులను శిక్షిస్తున్నారని ఆరోపించారు. ‘మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రూ.100 కోట్లు ఖర్చు చేశారు.. అందులో 5 శాతం ఖర్చుపెట్టినా కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు ఎత్తిపోయాలని సూచించిన రిటైర్డ్ ఇంజినీర్లను బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తానని, చర్లపల్లి జైల్లో వేస్తానని బెదిరించారు. శ్యామ్‌ప్రసాద్ లాంటి ఉద్యమ బిడ్డను అవమానించారు’ అని మండిపడ్డారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే నానాయాగి చేశారని మండిపడ్డారు. కానీ ఇసుక దందా కోసం మూడు చెక్‌డ్యాములను పేల్చివేసిన విధ్వంస ప్రభుత్వం ఇది అని దుమ్మెత్తిపోశారు.
నాడు గురువు చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిండు. నేడు శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ కోటి ఎకరాల మాగాణాన్ని నిషేధించిండు. ఒక్కో ఎకరానికి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నడు. ఇది ముమ్మాటికీ కమీషన్లు, పర్సంటేజీల పాలనే. ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన. తెలంగాణను ఢిల్లీకి తాకట్టుపెట్టిన సామంతుల పాలన. జలద్రోహం చేస్తున్నజలగల పాలన.
– కేటీఆర్
ప్రతి రంగం పతనం.. ప్రతి వర్గంలో ఆగ్రహం
కాంగ్రెస్ రాజ్యంలో రాష్ట్రంలోని ప్రతి రంగం పతనమై.. ప్రతి వర్గం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నదని కేటీఆర్ చెప్పారు. ‘వెయ్యి రోజుల పాలనలో 4.5 లక్షల కోట్ల అప్పులు చేసి కనీసం ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క చెక్‌డ్యామ్ కట్టలేదు.. కేసీఆర్ హయాంలో చేసిన పనులకు రిబ్బన్ కటింగ్‌లు తప్ప చేసిందేమీ లేదు’ అని దుయ్యబట్టారు. ‘వెకిలిమాటలు.. మకిలి చేతలు.. ఢిల్లీకి మూటలు.. మంత్రివర్గంలో తన్నులాటలు.. కీచులాటలు.. ఎంగిలి విస్తర్ల కాడ కుక్కలు కొట్లాడుకుంటున్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు తన్నుకుంటున్నారు.. వాటాల కోసం రోడ్డెక్కుతున్నరు’ అంటూ తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు.
నీ బూతులు వినేందుకు అసెంబ్లీకి రావాలా?
సీఎం రేవంత్‌రెడ్డికి పొద్దున లేస్తే బూతులు మాట్లాడం తప్ప తెలుగు కూడా సరిగ్గా రాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు భేషజాలు తప్ప బేసిన్లు తెలియవని.. ట్రిబ్యునళ్ల గురించి అవగాహన లేక అడ్డదిడ్డంగా మాట్లాడటం.. తన గురువు ఏపీ సీఎం చంద్రబాబుకు చెంచాగిరీ చేయడం మాత్రమే తెలుసని దెప్పిపొడిచారు. ‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు మాట్లాడే బూతులు వినడానికే కేసీఆర్ అసెంబ్లీకి రావాలా? అని ప్రశ్నించారు. గురుదక్షిణ కోసం గోదావరి, కృష్ణానీళ్లను రేవంత్‌రెడ్డి సంతర్పణ చేస్తున్నారని ఆరోపించారు. బనకచర్ల ముసుగులో అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే మౌనం వహించడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించారు.
‘తెలంగాణ ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టారని, కనీసం నిలదీయలేని చంద్రబాబు చెంచా ఈ ముఖ్యమంత్రి’ అంటూ విరుచుకుపడ్డారు. సాగునీటి రంగంలో తమకు ఆర్ విద్యాసాగర్‌రావు సలహాదారు అయితే రేవంత్‌రెడ్డి సలహాదారు మాత్రం చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే, తెలంగాణ బద్ధ వ్యతిరేకి ఐఏఎస్ అధికారి ఆదిత్యానాథ్ దాస్ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘జలద్రోహం చేస్తే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం.. జలసౌధను ముట్టడిస్తమని మేం వార్నింగ్ ఇస్తే జీఆర్ఎంబీ మీటింగ్ వాయిదా వేశారు. గోదావరి, కృష్ణలో ఒక నీటిబొట్టు ద్రోహం జరిగినా వదలం.. అదే జలాల్లో మిమ్మల్ని ఉప్పు పాతర వేస్తం’ అని ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి నీటి వాటాల్లో అన్యాయాన్ని నిలువరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ సమాజం క్షమించబోదని తేల్చిచెప్పారు.