యూపీ మోడల్ పెద్ద జోక్!
ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్య ట్వీట్
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోవడాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలా? అని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతను నిలదీశారు. ‘యూపీ మోడల్ గవర్నెన్స్ జోక్’ అంటూ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి యూపీకి వెళ్లిన బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే లక్ష్మణ్ ఓ పత్రికా విలేకరితో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ మోడల్‌ను దేశంలో అభివృద్ధి చేయడం కోసం జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న కేసీఆర్ ముందు యూపీ మోడల్‌ను తెలంగాణలో అమలుచేయాలని చేయాలని తలాతోక లేకుండా వ్యాఖ్యానించారు. ఆ పత్రికలో వచ్చిన ఈ వార్తను శుక్రవారం ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో చురకలు అంటించారు. ‘యూపీ మోడల్ గవర్నెన్స్.. వాట్ ఏ జోక్.. ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోవడం, అధికారంలో ఉన్న వ్యక్తులు రైతులను కారుతో తొక్కించడం, ప్రజలు విద్యుత్తు అంతరాయంతో కొట్టుమిట్టాడటం, స్వచ్ఛమైన తాగునీరు లేక బాధపడుతుండటం యూపీ పాలనావిధానం. తెలంగాణలో బీజేపీ చేయాలనుకున్నది అదే! అంటూ ట్వీట్ చేశారు. లక్ష్మణ్ వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం విరుచుకపడ్డారు. ‘యూపీ మోడల్ ఫేక్, ఫెయిల్డ్ మోడల్.. కేసీఆర్ మోడల్ గోల్డ్, హిట్ మోడల్.. మీకు యూపీ అంతగా నచ్చితే తెలంగాణను వదిలి.. అక్కడే నివసించండి’ అంటూ ట్వీట్లు చేశారు.