హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘యాసంగిలో వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు రైతులకు సూచించారు. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు బండి సంజయ్.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రం పండించిన ధాన్యాన్ని కొంటామని దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేశారు. ఇప్పుడేమో చేతులు ఎత్తేశారు. దీనిపైనే మా పోరాటం. బీజేపీ నాయకులను నిలదీస్తాం. ధాన్యం కొనకపోతే తరిమికొడతాం’ అని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని పలు సందర్భాల్లో బండి సంజయ్, కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదనే కుట్రను సీఎం కేసీఆర్ ముందుగానే గ్రహించి వరి వద్దని సూచించారని గుర్తుచేశారు.
బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని, ఇప్పుడు యాసంగి ధాన్యం కొనబోమంటూ కేంద్రం నాటకాలాడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దొంగ మాటలు చెప్పిన బీజేపీ నాయకులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఇప్పుడు ధాన్యం కొంటారా? అని ప్రశ్నించారు. రైతులను ఆగం చేసిన బీజేపీ నాయకులను తరిమికొట్టండి.. బీజేపీ నాయకులను నిలదీద్దాం.. ధాన్యం కొనకపోతే తరిమికొడదామని పిలుపునిచ్చారు. కేంద్రం వడ్లు మొత్తం కొనాలనే డిమాండ్‌తోనే ఉద్యమిస్తున్నామని తెలిపారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదు.. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు దేశం మొత్తం ఒకటే విధానం ఉండాలని డిమాండ్ చేశారు.
‘బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ ఎంతైనా తీసుకుంటామని, మీరు అర్థం చేసుకోవద్దని అనుకొంటే.. నేనేమీ చేయలేను. మీకు అర్థమయ్యేలా చేసే వైద్యం నా వద్ద లేదు’ అంటూ ఈ నెల ఒకటిన రాజ్యసభలో గోయల్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న వీడియోను కూడా కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. బుర్ర తక్కువ, బుద్ధి తక్కువ బండి సంజయ్ అనే దౌర్భాగ్యుడు, కిషన్‌రెడ్డి అనే పనికిమాలిన మంత్రిలో న సమజ్ ఎవరో చెప్పాలని సూచించారు. ప్రజలకు నూకలు తినడం నేర్పమంటవా అని మండిపడ్డారు. తెలంగాణ రైతులను, పౌరులను అవమానించిన ఏవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదనే హెచ్చరించే ఉద్దేశంతో ఆ వీడియోను పోస్ట్‌చేశారు.
29 సెప్టెంబర్, 2021
రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తీసుకుంటున్నా. ముఖ్యమంత్రిని పట్టించుకోకండి.
-బండి సంజయ్
1 డిసెంబర్, 2021
తెలంగాణలో రైతులు పండించే వడ్లయినా, అవి బియ్యంగానైనా కేంద్రమే మొత్తం కొనుగోలు చేస్తుంది. బాయిల్డ్ రైసా, రా రైసా అనే తేడా లేకుండా ఎంతైనా కేంద్రం కొనుగోలు చేస్తుంది.
-ఢిల్లీలో కిషన్‌రెడ్డి
1 ఏప్రిల్, 2022
బాయిల్డ్ రైస్ తీసుకోం.. రా రైస్ రూపంలో మాత్రమే మీరు ఎంత ఇచ్చినా కొనుగోలు చేస్తాం. మీరు అర్థం చేసుకోవద్దని అనుకొంటే.. నేనేమీ చేయలేను. మీకు అర్థమయ్యేలా చేసే వైద్యం నా వద్ద లేదు.
-రాజ్యసభలో పీయూష్‌గోయల్
9 ఏప్రిల్, 2022
రైతు పండించిన ప్రతి గింజను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నది. కేంద్రం వడ్లు కొనేందుకు సిద్ధంగా లేదనే దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు చేస్తున్నది. టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహాకుట్ర ఉన్నది.
-బహిరంగ లేఖలో బండి సంజయ్