KTR | పుష్ప-2 సినిమా సక్సెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును మరిచిపోవడమే హీరో అల్లు అర్జున్ చేసిన తప్పా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సక్సెస్ మీట్లో సీఎం పేరును మరిచినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె తనయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారంలో నటుడు అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. తాజాగా మరోసారి స్పందించారు.
అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు. సమావేశాల్లో మొదట ప్రజా సమస్యలపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. స్కాములు, ఫార్ములా అంటున్నారని.. వాటన్నింటిపై చర్చిద్దామన్నారు. చర్చించాల్సింది కేబినెట్లో కాదని.. అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. రుణమాఫీ పూర్తి చేయని, రైతు బంధు ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డికి సర్పంచ్ ఎన్నికల్లో రైతులు గుణపాఠం చెబుతారని చెప్పారు. లగచర్ల అంశాన్ని రాజ్యసభలోనూ ప్రస్తావిస్తామన్నారు. కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు. జమిలి ఎన్నికలు అంటున్నారని.. కాంగ్రెస్‌ను ఇంటికి పంపేందుకు 2028 వరకు వేచి ఉండాల్సిన అవసరం రాదేమోనని కేటీఆర్ అన్నారు.