వరంగల్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బడుగు జీవితాలకు బతుకుదెరువుగా నిలిచేలా వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నది. నిజాం కాలం నాటి ఆజంజాహీ మిల్లును మైమరిపించేరీతిలో వరంగల్ వస్త్రనగరి వరల్డ్‌క్లాస్ సిటీగా రూపుదిద్దుకుంటున్నది. ఎనిమిదేండ్ల క్రితం భూమిపూజ చేసిననాడు పడావుపడ్డ బీడుగా కనిపించిన నేల.. దసరా పండుగనాడు కొత్తబట్టలు కట్టుకొని ముస్తాబైనట్టు దర్శనమిస్తున్నది.
బుధవారం ఆ అద్భుతాన్ని చూసి.. ఆనాటి పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి, ఈనాటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబురపడ్డారు. వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్‌లో కిటెక్స్ గార్మెంట్స్ పరిశ్రమలోని స్పిన్నింగ్.. జిన్నింగ్ యూనిట్‌ను కేటీఆర్ పరిశీలించారు. కిటెక్స్ లోకల్ మేనేజర్ మనోజ్‌కుమార్ సహా ఇతర ప్రొడక్షన్ మేనేజర్లు, యూనిట్ సిబ్బంది కిటెక్స్ ప్రయాణాన్ని వివరించారు.
ఈ సందర్భంగా వరంగల్‌కు కిటెక్స్ పరిశ్రమ రావడం వెనుక కేటీఆర్ చొరవను గుర్తుచేశారు. అందుకు కేటీఆర్ ‘థాంక్యూ ఫర్ యువర్ గుడ్ మెమొరీ’ అంటూ వారి భుజం తట్టి అభినందించారు. కిటెక్స్ యూనిట్ మొత్తం కేటీఆర్ కలియదిరిగారు. మిషనరీ, ప్రొడక్షన్, టెక్స్టైల్ పార్క్‌లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
కిటెక్స్ యూనిట్ పరిశీలన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్ దార్శనికతకు..ప్రణాళికాబద్దమైన ఆలోచన విధానానికి తార్కాణం కళ్లముందు కనిపిస్తున్న కాకతీయం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రసుత పరిస్థితి. కేసీఆర్ విజన్‌కు నిదర్శనం. ఓరుగల్లు అంటేనే ఆజంజాహీ మిల్లుకు, నాణ్యమైన పత్తికి ప్రసిద్ధి. అలాంటి వరంగల్ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో తన వైభవాన్ని కోల్పోయి ఇక్కడి నేతన్నలు సూరత్, సోలాపూర్, భీవండికి వలసపోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్‌కు పూర్వవైభవం తీసుకురావాలని కేసీఆర్ సంకల్పించారు.
‘ఫాం టూ ఫ్యాషన్.. ఫాం టూ ఫ్యాబ్రిక్’ కావాలన్న లక్ష్యంతో నాడు కేసీఆర్ ఇక్కడి నల్ల రేగడి నేలలో పండే తెల్ల బంగారం (పత్తి) రైతుకు లాభం అవుతుందని, ఫ్యాబ్రిక్ రంగంలో ఉన్న మహిళలకు ఉపాధి కలుగుతుందన్న ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కును అనాటి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. కిటెక్స్, యంగ్వన్, గణేశా లాంటి పరిశ్రమలు వచ్చాయి. సుమారు 20 నుంచి 30 వేల మందికి ఉపాధి ఆవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతుందడం సంతోషకరం’ అని అన్నారు. కిటెక్స్ పురోగతిని, అక్కడి అద్భుతమైన టెక్నాలజీని కేటీఆర్ అభినందించారు.
‘ఆత్యాధునికమైన స్పిన్నింగ్, గార్మెంట్స్ పరిశ్రమను పరిశీలించాం. చిత్తశుద్ధితో పనిచేస్తే తెలంగాణకు ఎంత మేలు కలుగుతుంది అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం కాకతీయ మెగాటెక్స్టైల్పార్క్. కిటెక్స్ను చూస్తే మనసునిండా సంతోషంగా ఉన్నది. తెలంగాణ ప్రజలు జీవితాంతం తలెత్తుకుని బతకాలన్న కేసీఆర్ అద్భుత ఆలోచనకు వరల్డ్‌క్లాస్ టెక్నాలజీ వరంగల్ ముందు వాలిపోయింది. కేసీఆర్ కల సాకారమై 10 వేలమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరడం చాలా సంతోషం’ అని తెలిపారు.
‘ప్రభుత్వాలు మారవచ్చు. రాజకీయ పార్టీల సారథ్యం మారవచ్చు. కానీ రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం. ప్రజలకు ఉపాధి కల్పించే మెగాటెక్స్టైల్పార్క్ వంటి దీర్ఘకాలిక కార్యక్రమాలు శాశ్వతం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం చింతలపల్లి వద్ద మంజూరు చేసిన ఫె్లైఓవర్ (ఆర్వోబీ) పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. పార్లోపల మౌలిక సదుపాయాలు కల్పించే పనులు మందకొడిగా సాగుతున్నాయని, సత్వరం పూర్తి చేయాలని చెప్పారు.
కిడ్స్‌వేర్ తయారీ రంగంలో ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా కిటెక్స్‌కు పేరున్నది. 50 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ కంపెనీ ఎంసీ జాకబ్ 1968లో ఎర్నాకుళం జిల్లా కిజకంబళంలో ‘అన్నా కిటెక్స్ గ్రూప్’ను స్థాపించారు. అల్యూమినియం ఉత్పత్తులతో ప్రారంభమై మసాలాలు, టెక్స్టైల్స్, సూల్, ట్రావెల్ బ్యాగ్స్ తదితర రంగాల్లోకి విస్తరించిన ఈ సంస్థ 1992లో ఎంసీ జాకబ్ కొడుకు సాబు ఎం జాకబ్ ‘కిటెక్స్ గార్మెంట్స్’ను స్థాపించారు. ‘లిటిల్‌స్టార్’ బ్రాండ్ పేరుతో చిన్న పిల్లల దుస్తులను తయారు చేస్తున్నది. కంపెనీ ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
వస్త్రతయారీ రంగంలో ప్రత్యేకించి గార్మెంట్స్ మేకింగ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతికొద్ది యంత్ర పరికరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో ఉన్న మిషనరీ.. దేశంలోనే ఎక్కడాలేదని తెలుస్తున్నది. వరంగల్ కిటెక్స్ యూనిట్‌లోని ‘రీటర్’ అనే మిషనరీ దేశంలో మరెక్కడాలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఫైబర్ టూ ఫ్యాబ్రిక్ మోడ్‌లో నడిచే ఈ రీటర్ మిషనరీని ప్రస్తుతం స్విట్జర్లాండ్ దేశంలో వినియోగిస్తున్నారు. జిన్నింగ్ అండ్ స్పిన్నింగ్ ఏకకాలంలో చేసేలా మిషన్ పని చేస్తుందని నిర్వాహకులు చెప్పారు.