KTR | సిరిసిల్ల టౌన్, మార్చి 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఓ అభిమానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తన సొంత ఖర్చులతో టీస్టాల్‌ను ఏర్పాటు చేసిన ఆయన ఆదివారం స్వయంగా ప్రారంభించారు. దీంతో ఆ అభిమాని కుటుంబానికి అవధులే లేవు. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద కొంతకాలంగా కేటీఆర్ అభిమాని అయిన బత్తుల శ్రీనివాస్ టీస్టాల్ నిర్వహిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నాడు. కేటీఆర్‌పై ఉన్న అభిమానంతో హోటల్‌కు ‘కేటీఆర్ టీస్టాల్’ అని పేరుతోపాటు కేటీఆర్ ఫొటోల ఫ్లెక్సీతో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కేటీఆర్ ఫొటో ఉన్నదన్న కారణంతో ట్రేడ్ లైసెన్సు లేదన్న సాకుతో ఇటీవల మున్సిపల్ అధికారులు హోటల్‌ను క్రేన్‌తో అక్కడి నుంచి తొలగించారు. దీంతో టీస్టాల్‌తో బతికే శ్రీనివాస్ కుటుంబానికి ఆధారం పోయింది. శ్రీనివాస్ హోటల్‌ను తొలగించిన సమాచారం తెలుసుకున్న కేటీఆర్ వారితో ఫోన్లో మాట్లాడి ధైర్యం కల్పించారు. సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సందర్భంలో కేటీఆర్‌ను బాధిత శ్రీనివాస్ కుటుంబసభ్యులు కలవగా తన సొంత ఖర్చులతో టీస్టాల్‌ను ఏర్పాటు చేయిస్తానని బాధిత కుటుంబానికి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం స్థానిక గాంధీచౌరస్తాలో నూతన హంగులతో తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన టీస్టాల్‌ను ఆదివారం ఎమ్మెల్సీ రమణతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
తన సొంత ఖర్చులతో హోటల్‌ను ఏర్పాటుచేసిన కేటీఆర్‌కు ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ‘అన్నలా తనకు అండగా నిలిచిన కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా’ అని శ్రీనివాస్ సంతృప్తిని వ్యక్తంచేశాడు. ‘సార్ పేరు పెట్టుకున్నవ్.. హోటల్‌కి కేటీఆర్ బ్రాండ్ నిలబెట్టాలి’ అంటూ ఈ సందర్భంగా టీ తాగుతూ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ రమణ సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ జిందం కళ, బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.