కావేరి ఎంబీబీఎస్, శివాని ఎన్ఐటీ విద్యకు ఆర్థిక సాయం
మాట నిలుపుకొన్నానంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్
కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థినులు
హైదరాబాద్, మార్చి 6 : మంత్రి కేటీఆర్ మరోసారి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్, ఎన్ఐటీలో సీటు సాధించిన ఇద్దరు నిరుపేద అక్కాచెల్లెళ్లు కావేరి, శివాని చదువులకు పూర్తి భరోసా ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కావేరి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, శివాని ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీలో బీటెక్(ఈసీఈ) కోర్సుల్లో ప్రవేశాలు సాధించారు. మెరిట్ ఆధారంగా ఉచిత సీట్లు వచ్చినప్పటికీ హాస్టల్, మెస్‌చార్జీలు చెల్లించలేని పేదరికంతో బాధపడుతున్నారు. వారి తండ్రి రాజమల్లు ఒక ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్‌గా పనిచేస్తూ, కొవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయారు. ప్రస్తుతం దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించే స్థోమత లేక ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ చలించిపోయారు. పెద్ద మనసుతో స్పందించారు. వారు చదువులు కొనసాగించేందుకు ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. ‘శివాని, కావేరికి సహాయం చేస్తానన్న వాగ్దానం నిలబెట్టుకున్నా. ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ చదువుతున్న ఈ ఇద్దరూ తెలివైన యువతులు. భవిష్యత్తు పట్ల స్పష్టత, అసాధారమైన ఆత్మవిశ్వాసం ఉన్న వీరిని కలవడం ఆనందంగా ఉన్నది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ చదువులకు అండగా నిలిచిన కేటీఆర్‌కు అక్కాచెల్లెళ్లు కృతజ్ఞతలు తెలిపారు.