KTR | భారత్ దిగువ మధ్యాదాయ దేశం అయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రమని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇది అని అన్నారు. సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్ కం బెంచ్ మార్క్ ను దాటి ఎదిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించిందని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఈ హోదాను సాధించిన ఐదు అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. పదేండ్ల పాలనలో ఏం జరిగింది? అంటే.. దరిద్రం తాండవించిన ప్రాంతం.. ధనిక రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు.
నా తెలంగాణ ప్రజలు బికారులు కాదు అని..సిరిసంపదలతో తులతూగే తెలంగాణ తల్లి బిడ్డలు అని కేటీఆర్ తెలిపారు. విఫల రాష్ట్రం కాలేదు తెలంగాణ..సఫల సంపన్న రాష్ట్రమై సగర్వంగా నిలిచిందని పేర్కొ్న్నారు. తమ చెమటను.. నైపుణ్యాన్ని.. మేధస్సును రంగరించి తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికి శుభాభివందనాలు చెప్పారు.
తెలంగాణ వస్తే ఏమొచ్చింది? జాతి సంపద పెరిగింది.. జనం ఆదాయం అద్భుతంగా పెరిగింది అని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దార్శనిక పాలనలో ఆర్థిక వ్యవస్థ అద్వితీయంగా అభివృద్ధి చెందిందని జాతీయ నివేదికలే కాదు..అంతర్జాతీయ సంస్థలు తేల్చిచెబుతున్నాయని పేర్కొన్నారు. దివాలా రాష్ట్రం అని దిక్కుమాలిన ప్రచారాలు చేసేవాళ్లకు ప్రపంచ బ్యాంకు తాజా నివేదికే సమాధానం అని స్పష్టం చేశారు.