హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో నాలాలపై దురదృష్టకర ఘటనలు, ప్రమాదాలు జరిగితే అందుకు ఉన్నతాధికారులనే బాధ్యులను చేస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ప్రభుత్వం ఏటా అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నా దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని, ఈసారి అలాంటివి పునరావృతం కాకుం డా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మంగళవారం ఆయన వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడు తూ.. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో నాలాలకు సంబంధించిన రక్షణ చర్యలు, అభివృద్ధి పనులను వానకాలం వచ్చేలోగా పూర్తిచేయాలని స్పష్టంచేశా రు. జీహెచ్ఎంసీతో పాటు నగర పరిసర ప్రాంతాల్లోని పురపాలికల్లో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా స్థానిక మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీచేయాలని సీడీఎంఏ ఎన్ సత్యనారాయణకు సూచించారు. నాలా సేఫ్టీ ఆడిట్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేసి, అవసరమైనచోట నాలాల బలోపేతం, ఫెన్సింగ్, అభివృద్ధి తదితర రక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను ఆదేశించారు.