రాజకీయాల్లో చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత సున్నితమైందో, చట్టపరంగా ఎంత కఠినమైందో సంజయ్‌కి తెలియకపోవడం విడ్డూరం. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనకు నిఘా వ్యవస్థల పనితీరు, విధానాలపై కనీస అవగాహన, పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం. -కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తేతెలంగాణ): ‘బాధ్యాతయుతమైన కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిల్లరగా, దిగజారి మాట్లాడటం కాదు.. దమ్ముంటే ఆరోపణల్లో ఒక్క శాతం నిజమున్నా నిరూపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. లేదంటే ఆరోపణలను ఉపసంహరించుకొని 48 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని శుక్రవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. లీగల్ నోటీసులు పంపిస్తున్నానని, 48 గంటల్లో స్పందించకుంటే కోర్టుకు ఈడుస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సున్నితమైన అంశంపై సంజయ్ హద్దు మీరి
మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కనీసం కామన్ సెన్స్ లేకుండా, వాస్తవాలను తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్ స్థాయిలో చిల్లర కామెంట్లు చేయడం ఆయనకు రివాజుగా మారిందని నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత సున్నితమైందో, చట్టపరంగా ఎంత కఠినమైందో సంజయ్‌కి తెలియకపోవడం విడ్డూరమని, కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్‌కి నిఘా వ్యవస్థల పనితీరు, విధానాలపై కనీస అవగాహన, పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం దురదృష్టకరమని ఎద్దేవాచేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సంజయ్..ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ‘కేంద్రమంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోసేంత ఈజీ కాదనే విషయం గ్రహించాలి’ అంటూ దెప్పిపొడిచారు. ఫోన్ ట్యాపింగ్‌పై సంజయ్ మాట్లాడిన ప్రతిసారీ దిగజారుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. మీడియాలో హెడ్లైన్ల కోసం, ఛీప్ పబ్లిసిటీ కోసం వీధి నాటకాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
బీసీ కోటాకు చట్టబద్ధత రాకుండానే సంబురాలా?
‘42శాతం బీసీ కోటాకు చట్టబద్ధత రాకుండానే కాంగ్రెస్ సంబురాలు ఎందుకు చేసుకుంటున్నది? ఏం సాధించారని? బలహీనవర్గాలకు ఏం ఉద్ధ్దరించారని ఉత్సవాలు చేసుకుంటున్నరు? కాంగ్రెస్ అగ్రనే త రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి?’ అంటూ కేటీఆర్ ప్రశ్నలవర్షం కురిపించారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు సివిల్ కాంట్రాక్టుల్లో 42శాతం వాటా కోసం ఎనుముల బ్రదర్స్ అనుమతి తీసుకోవాలా? అని ఒక ప్రకటనలో నిలదీశారు. ‘అమలుకాని హామీలు..అనవసర వేడుకలు ఇదే తెలంగాణ కాంగ్రెస్ మోడల్’ అంటూ చురకలంటించారు. రాహుల్‌గాంధీ తన నినాదాన్ని‘జిత్నీ డిక్లరేషన్స్ ఉత్నా ఝూట్’గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పేరిట టైంపాస్ చేస్తున్న తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారును వెనకేసుకురావడంలోని అంతర్యమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ఏటా రూ. 20 వేల కోట్లు, ఐదేండ్లలో లక్ష కోట్లు పెడతామని ఊదరగొట్టిన కాంగ్రెస్..గద్దెనెక్కిన తర్వాత దగా చేస్తున్నదని ధ్వజమెత్తారు. రెండు బడ్జెట్లలో బీసీ సంక్షేమానికి రూపాయి కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. రాజీవ్ యువ వికాసం కింద ఎంతమంది బీసీ యువకులకు రుణాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 50 కోట్లతో నిర్మిస్తామన్న ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఆత్మీయ భవనం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
42శాతం బీసీ కోటాకు చట్టబద్ధత రాకుండానే కాంగ్రెస్ ఎందుకు సంబురాలు చేసుకుంటున్నది? ఏం సాధించారని? బలహీనవర్గాలకు ఏం ఉద్ధ్దరించారని ఉత్సవాలు చేసుకుంటున్నరు? దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు సివిల్ కాంట్రాక్టుల్లో 42శాతం వాటా కోసం ఎనుముల బ్రదర్స్ అనుమతి తీసుకోవాల్నా? -కేటీఆర్
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సంజయ్..ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరిస్తున్నరు. సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం. కేంద్ర మంత్రిగా పనిచేయడమంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోసేంత ఈజీ కాదనే విషయం గ్రహించాలి. -కేటీఆర్