KTR : స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరితోపాటు పలువురు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వీటితోపాటు ఏ ఎన్నికలు వచ్చినా, పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే.. గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. కానీ ‘గ్యారెంటీల’ పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదు. సమాజంలోని రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల వారు అందరికీ హామీలు ఇచ్చి, కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసింది’ అని కేటీఆర్ ఆరోపించారు.
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు మేం ‘బాకీ కార్డులను’ తీసుకువచ్చాం. ఈ ‘బాకీ కార్డుల’ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి పడిన బాకీలను ఇంటింటికి, మనిషి మనిషికి తెలియజెప్పడానికి ఉద్యమాన్ని తీసుకున్నాం. ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకుపోతే, అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అభయహస్తం భస్మాసుర హస్తమని తేలిపోయింది. హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు. గత 22 నెలలుగా హైదరాబాద్ నగరంలో ఉన్న రోడ్లను కూడా ప్రభుత్వం నిర్వహించలేకపోతున్నది’ అని మండిపడ్డారు.
హైదరాబాద్ నగరానికి మన హయాంలో చేసిన అభివృద్ధిని చూసి, మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనకు ఓటువేసి గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ సునామీలా విస్తరిస్తుంది. ఆ మేరకు ప్రజల నుంచి స్పందన వస్తుంది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలన్న స్పష్టమైన ఆలోచన ప్రజల్లో కనిపిస్తున్నది. ఇది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజల్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టి, తిరిగి ప్రజల సంక్షేమ, అభివృద్ధి పాలన కోసం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం రావాలన్న ఆకాంక్ష బలంగా ఉన్నదని స్పష్టమవుతోంది’ అని కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి వచ్చింది.
రైతులు గ్రామాల్లో ఆగ్రహావేశాలతో ఉన్నారు. మహిళలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చేసిన మోసంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వృద్ధులను మోసం చేశారు. పెన్షన్‌దారులంతా కోపంగా ఉన్నారు. యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులు, విద్యార్థినులకు స్కూటీలు అని చెప్పి మాటతప్పారు. దాంతో యువత, విద్యార్థులు కాంగ్రెస్‌పై కోపంగా ఉన్నారు. తెలంగాణలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నడు’ అని విమర్శించారు.
‘రేవంత్ సర్కారు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు కానీ, కొత్త నగరాన్ని కడతానని ఫోజులు కొడుతున్నాడు. నగరంలో కనీసం మోరీలు శుభ్రపరిచే పరిస్థితి లేదు. వీధి దీపాలు వెలిగించే పరిస్థితి లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కొత్త నగరం కడతాడట. ఒకప్పుడు తెలుగువాడు దేశంలో ఉన్నాడని ఎన్టీఆర్ నిరూపిస్తే.. దేశంలో తెలంగాణవారు ఉన్నారని కేసీఆర్ నిరూపించారు.
కేసీఆర్ అద్భుతమైన ప్రజా ఉద్యమాలను నిర్వహించి, రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల పాలనతో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు.