రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్టు పేదల మీదికి దూకుడుగా పోతున్నది. మోదీ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఎలా రకరకాల కారణాలు చెప్పారో.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తున్నది. 40,50 ఏండ్ల కింద ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చిన వాటిని ఇప్పుడు కూలగొడతామంటే కుదరదు. బిల్డర్లు, బడా వ్యాపారవేత్తలను బెదిరించేందుకు, బ్లాక్ మెయిల్ చేసేందుకు, వసూళ్లు చేసేందుకే హైడ్రాను వాడుతున్నరని భావిస్తున్నం. మూసీ పేరిట కాంగ్రెస్ సర్కార్ ఏవిధంగా లూటీ చేస్తున్నదో ప్రజల దృష్టికి తీసుకుపోతం.
– మాజీ మంత్రి కేటీఆర్
KTR | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : మూసీ బాధిత ప్రజలకు భారత రాష్ట్ర సమితి పార్టీ రక్షణ కవచంలా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. పేదలకు ఎవ్వరూ లేరని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలతో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నదని విమర్శించారు. మూసీ, హైడ్రా బాధిత ప్రాంతాల్లో త్వరలోనే బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పర్యటిస్తుందని, అక్కడి ప్రజలకు భరోసా కల్పిస్తామని చెప్పారు. వసూళ్ల కోసమే హైడ్రాను వాడుకుంటున్నారని, బిల్డర్లు, వ్యాపారులు, డబ్బున్న వారిని బెదిరించేందుకే దాన్ని ఉపయోగిస్తున్నారని, హైడ్రా, మూసీ భయాందోళనలతో రియల్ ఎస్టేట్ రంగం దివాలా తీసిందని దుయ్యబట్టారు. మూసీ ప్రాజెక్టు అంశంపై హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి తెలంగాణ భవన్లో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. దాదాపుగా రెండు గంటల సమావేశం అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మూసీపై ఓసారి సుందరీకరణ అని, మరోసారి నల్లగొండకు నీళ్లిస్తామని, మరోసారి అసలు డీపీఆరే లేదని రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ విషయంలో భయానక వాతావారణాన్ని సృష్టించారని అన్నారు. మూసీకి సంబంధించి వందశాతం మురుగునీటి శుద్ధి ప్లాంట్లను తాము రూ.4 వేల కోట్లతో నిర్మించామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీ శుద్ధి చేశామని, నల్లగొండ జిల్లాకు శుద్ధిచేసిన నీళ్లే వెళ్తాయని, కొత్తగా ఖర్చు చేయాల్సిన పనిలేదని తెలిపారు. ఐదారు దశాబ్దాల్లో చేయలేని పనులను కేసీఆర్ హయాంలో పదేండ్లలోనే చేశామని చెప్పారు.
గరీబోళ్లకు అన్యాయం జరగవద్దనే..
కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట్‌కు నీళ్లు తెచ్చేందుకు 1100 కోట్లు ఖర్చు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయించిందని కేటీఆర్ గుర్తుచేశారు. నల్లగొండకు మంచినీళ్లిచ్చే ఏర్పాట్లు తామే చేశామని, నల్లగొండకు నీళ్లిచ్చే ఇష్టం లేదా అని సీఎం ఆరోపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. గతంలోనే మూసీ సుందరీకరణకు సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా ప్రయత్నం చేశామని, కానీ గరీబోళ్లకు అన్యాయం జరుగుతదంటే ఆ ప్రాజెక్ట్ వద్దని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. మానవీయ ముఖ్యమంత్రి ఉంటే నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయని చెప్పారు. మూసీ సుందరీకరణ తాము కూడా చేశామని, ఒక పేదోడి కడుపు కూడా కొట్టలేదని తెలిపారు. మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న రాజీవ్‌నగర్ బస్తీలో 20వేల కుటుంబాలున్నాయని, 1980లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి ఇటీవల మీడియా సమావేశంలో ఆ బస్తీలోని చెరువు ఆక్రమణకు గురైందని ప్రజెంటేషన్ ఇచ్చారని, నాడు పట్టాలిచ్చింది కాంగ్రె స్ కాదా? అని గుర్తుచేశారు. ‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పునకు ఇప్పుడు పేదలను బలి చేస్తారా? మీరే పట్టాలిచ్చి మీరే కూలగొడుతారా?’ అంటూ నిలదీశారు. తాము నిర్మించిన అన్ని ఎస్టీపీలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నాలాల అభివృద్ధి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని గుర్తుచేశారు.
ప్రజల పక్షాన న్యాయపోరాటం
హైడ్రా బాధిత ప్రాంతాలను కూడా సందర్శిస్తామని, హైడ్రా పేరుతో ప్రభుత్వం భయపెడుతున్న అన్నిప్రాంతాలకు వెళ్లి అకడి ప్రజలకు భరోసా కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు. చట్టాన్ని ప్రభుత్వం గౌరవించకపోతే తాము న్యాయపరంగా ప్రజల పక్షాన పోరాడుతామని ప్రకటించారు. దాదాపు 440 మం ది వచ్చి అండగా ఉండాలని బీఆర్ఎస్ లీగల్ సెల్‌ను కోరారని, తమ పార్టీ లీగల్ సెల్‌ను బలోపేతం చేస్తామని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజలనే కబ్జాదారులు అంటున్న ప్రభుత్వ విధానాన్ని ఎండగడతామని హెచ్చరించారు. హైడ్రాతో భయానక వాతావరణం నెలకొన్నదని, మొన్న హైడ్రా కారణంగానే కాంగ్రెస్, ఎంఐ ఎం నాయకులు కొట్టుకున్నారని చెప్పారు. తమకు అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అంటున్నారని, సీఎం, ఆర్థికమంత్రే దివాళాకోరు మాటలు మాట్లాడితే అప్పులెలా పుడతాయని కేటీఆర్ ప్రశ్నించారు. ‘నిర్మాణం కాదు విధ్వంసం చేస్తామంటే ఇలాంటి పరిస్థితే ఉంటుంది’ అని ఎద్దేవా చేశారు.
మూసీ ప్రజల మధ్యకు రండి
‘మా ఫాంహౌస్‌లు చట్టవిరుద్ధంగా ఉంటే కూలగొట్టండి.. మా ఫాంహౌస్‌లు కూలగొడితే నీకు రాక్షసానందం కలుగుతుందంటే కూలగొట్టొచ్చు. కానీ పేద ప్రజల జోలికి మాత్రం వెళ్లొద్దు’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. ‘అఖిలపక్షం కాదు మూసీ పరీవాహక ప్రాంతానికి రండి’ అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. మూసీ పరీవాహక ప్రజల మధ్యకు వచ్చి ఏం చేయబోతున్నారో చెప్పాలని, తాము కూడా మీడి యా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వేటికీ డబ్బుల్లేవు కానీ..
‘స్కూళ్లలో చాక్‌పీస్‌లకు పైసల్లేవ్, దవాఖానల్లో మందుల్లేవ్, గురుకులాల అద్దె కట్టేందుకు డబ్బుల్లేవ్, తులం బంగారమిచ్చేందుకు పైసల్లేవ్, రుణమాఫీ, రైతుబంధుకు పైసల్లేవ్.. పింఛన్లకు డబ్బుల్లేవ్.. కానీ మూసీకి 1.50 లక్షల కోట్లు ఎక్కడివి?’ అని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వం ఖమ్మం ప్రజలకు వరద సాయం పైసా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2వేల కోట్లను చెల్లించామని, ప్రభుత్వమనేది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలు చెల్లించాలని, 650 కోట్లు ఇస్తే సరిపోతుందని కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే దాదాపు 11.50 లక్షల మందికి మేలు జరుగుతుందని, గత ప్రభుత్వాలు బకాయిలు పెడితే ప్రస్తుత ప్రభుత్వాలు కట్టాల్సిందేనని చెప్పారు.
80వేల కోట్లు ఏమైనయ్?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 10 నెలల్లో 80 వేల కోట్లు అప్పుచేశారని, రాష్ట్రంలో ఒక కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని, మరి అంత డబ్బు ఎకడికి పోయిందని కేటీఆర్ నిలదీశారు. ‘మన రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్.. మనం అన్నీ కట్టిన తర్వాత కూడా మిగులు ఉందని బడ్జెట్ ప్రసంగంలో భట్టి చెప్పారు.. మరి ఎందుకు ఇప్పుడు ఇంతపెద్ద ఎత్తున అప్పు చేశారు?’ అని ప్రశ్నించారు. హైడ్రా, మూసీ పేరుతో సృష్టిస్తున్న భయానక వాతావారణం నుంచి ప్రజలను రక్షించేందుకు బీఆర్ఎస్ కదులుతున్నదని, ఇందుకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఒక మంత్రి మాట్లాడే మాట ఇం కో మంత్రికి తెలియదని, వాళ్ల శాఖలకు సం బంధం లేని అంశాలపై మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డీ సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, వాణీదేవి, బీఆర్ఎస్ నేతలు పీ కార్తీక్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
రేవంత్రెడ్దిది బీజేపా.. కాంగ్రెస్సా?
దేశ రక్షణ గురించి బీజేపీ నాయకుల కంటే రేవంత్‌రెడ్డే ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆయన ప్రసంగం చూస్తుంటే కాంగ్రెస్‌లో ఉన్నారా?, బీజేపీలో ఉన్నారా? అన్న అనుమానం కలిగిందని కేటీఆర్ దెప్పిపొడిచారు. దేశరక్షణ గురించి ఉన్నట్టుండి రేవంత్‌రెడ్డికి ప్రేమ పుట్టకొచ్చిందని ఎద్దేవాచేశారు. దేశరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నదని స్పష్టంచేశారు. మూసీ పుట్టే దగ్గర 12 లక్షల చెట్లు నరికివేసి, 2,900 ఎకరాలు ధారాదత్తం చేసి ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. గంగానది పుట్టిన గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల మేర ఎకో సెన్సిటివ్ జోన్ ఉన్నదని, మరి మూసీకి కనీసం 10 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ లేదా? అని ప్రశ్నించారు. తామే కేబీఆర్ పార్ వద్ద ఫ్లై ఓవర్లు కట్టాలని అనుకున్నామని, పర్యావరణం దెబ్బతింటుందంటే ఆ ప్రతిపాదనలను విరమించుకున్నామని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీని ఒకమాట అనాలంటే దడ అని, అందుకే కేంద్ర బడ్జెట్లో మనకు అన్యాయం జరిగినా అసెంబ్లీలో ఒకమాట మాట్లాడలేదని కేటీఆర్ ఎద్దేవాచేశారు.
జనావాసాలు లేని చోట పెట్టాల్సిన రాడార్ కేంద్రాన్ని తెలంగాణలో ఎందుకు పెట్టినట్టు? మూసీని పురిట్లోనే ఆగంచేసి కింద మాత్రం మంచి చేస్తామంటే ఎవరు నమ్ముతరు? 2017లో రాడార్ కోసం మేం జీవో ఇచ్చినా పర్యావరణం దెబ్బ తింటుందంటే దాన్ని తొకిపెట్టినం.
-కేటీఆర్
పేదలకు దికెవరు లేరన్నట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తానంటే బీఆర్ఎస్ ఊరుకోదు. హైదరాబాద్‌లోని పేదలకు, బస్తీవాసులకు రక్షణ కవచంలా ఉంటది. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మా నాయకులమంతా కలసికట్టుగా కదులుతం. రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతం.
-కేటీఆర్
మేమే రాడార్ జీవో ఇచ్చామని అంటున్నవ్.. మరి మేం చేసిన పనులన్నీ చేస్తున్నవా? రైతుబంధు, 24గంటల కరెంట్, పింఛన్లు, పాలమూరు ఎత్తిపోతల పథకం మేం చేసినం.. మరి నువ్వు వాటిని
కొనసాగిస్తున్నవా?
-కేటీఆర్