KTR | హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిన్న నిరుద్యోగ విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. నోటిఫికేషన్లు ఏవీ అని నిలదీసినందుకు నిరుద్యోగులను దారుణంగా తిడుతూ.. ఘోరంగా లాఠీ చార్జి చేశారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని నందినగర్‌లో మనూ విద్యార్థులతో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రెండు లక్షల ఉద్యోగాలు ఇష్టమని చెప్పి ఎందుకు రాహుల్ గాంధీ ఫోజు కొట్టిండని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు తీస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. ఉద్యోగాలేవని నిలదీశారు. రాహుల్ గాంధీ విద్యార్థులతో మాట ముచ్చట పెట్టి ఉద్యోగాల పేరుతో మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశం పైన స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు విద్యార్థుపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బట్టల దుకాణం, సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి పోతున్నాడని విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషనులు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి ఆరేడు పోలీస్ స్టేషన్లు తిప్పి విద్యార్థులను నిరుద్యోగ యువకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.