శంకర్ విలాస్‌లో రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసు. సర్వే నంబర్ 83లో రేవంత్‌రెడ్డి చేసేదంతా తెలుసు. రెండేండ్ల్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నది. అన్నీ బయటపెడుతాం. ఎవరినీ వదిలేది లేదు.
–కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తున్నదని, మంత్రులు, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఇల్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందని, రేవంత్‌రెడ్డి దండుపాళ్యం ముఠాకు నాయకుడిగా తయారయ్యారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పరిశ్రమల యజమానులకు తుపాకీలు పెట్టినప్పుడు, వాటాల పంచాయితీతోనే మంత్రులు బజారుకెకినప్పుడు, సీనియర్ అధికారులు పారిపోతుంటే.. రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది? అని నిలదీశారు. పింక్‌బుక్‌లు, రెడ్‌బుక్‌లు లేవు, కేవలం ఖాకీబుకు మాత్రమే ఉంటుందన్న డీజీపీ ఇప్పడేం సమాధానం చెప్తారని నిలదీశారు. ఖాకీ బుక్కును కాకులు ఎత్తుకుపోయాయా? అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వేల కోట్లు సంపాదిస్తే.. మంత్రులు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్.. తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిల్ అని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు, ఐఏఎస్ అధికారులు ఉద్యోగం చేసుకోలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణభవన్‌లో గురువారం మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, అనిల్‌జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దల తీరు వల్ల తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల గొడవలు తారాస్థాయికి చేరాయని విమర్శించారు. ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కుమారుడి మధ్య ఐఏఎస్ అధికారి రిజ్వీ నలిగిపోయారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక వీఆర్ఎస్ తీసుకున్నారని పేర్కొన్నారు. క్యాబినెట్ సెక్రటరీ అయ్యే అవకాశం ఉన్నా, ఇంకా ఎనిమిదేండ్ల సర్వీసు ఉన్నా వీరి ఒత్తిళ్లకు తాళలేక ఐఏఎస్‌లు చేతులెత్తేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పరిపాలన అవినీతి కంపు రాష్ట్రవ్యాప్తంగా కొడుతున్నదని, ఇది పూర్తిగా మాఫియా రాజ్యంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. తాము తెలంగాణను అగ్రికల్చర్లో అగ్రస్థానంలో నిలిపితే, కాంగ్రెస్ సర్కారు మాత్రం గన్‌కల్చర్ తీసుకొచ్చిందని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి బలహీన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. సొంత మంత్రి ఇంటికి టాస్‌ఫోర్స్ పోలీసులను ముఖ్యమంత్రి పంపడం, ఆ నిందితుడిని స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని మాయమైపోవడం మునుపెన్నడూ చూడలేదని చెప్పారు. ‘ముఖ్యమంత్రి అనుచరుడు రోహిన్‌రెడ్డి బెదిరించాడని, తుపాకీ రేవంత్‌రెడ్డే ఇచ్చిండని మంత్రి కుమార్తె చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం రోహిన్‌రెడ్డే చూస్తాడు అంట. షాడో సినిమా మంత్రి రోహిన్‌రెడ్డి. బెదిరించింది వాస్తవమేనని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యమంత్రే తుపాకీ ఇచ్చి పంపించాడని ఆరోపణ చేసినప్పుడు, సీఎం సిగ్గు లేకుండా మౌనంగా ఉన్నారు. రేవంత్‌రెడ్డికి సిగ్గు, ఇజ్జత్ ఉంటే ఆమె చెప్పేది తప్పని చెప్పాలి. లేదా నువ్వు మాట్లాడేది తప్పని మంత్రిని తీసి పడేయాలి. రేవంత్‌రెడ్డి వంటి బలహీన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎప్పుడూ చూడలేదు. స్వయంగా నీపై మంత్రి బిడ్డే ఆరోపణలు చేస్తే ఆ మంత్రినీ పకకు జరపలేవు. స్వయంగా నీ మంత్రులు మీపై ఆరోపణలు చేస్తున్నా కనీసం వారిని ముట్టుకోలేని బలహీన ముఖ్యమంత్రివి. సిగ్గు ఉంటే పాలనపై పట్టు నిరూపించుకోవాలి. పరిపాలనపై, మంత్రులపై ఎలాంటి పట్టులేదని తేలిపోయింది. దావూద్ ఇబ్రహీం లాంటి ముఖ్యమంత్రిని తరిమేసుకుంటేనే తెలంగాణకు పట్టిన శని పోతుంది’ అని కేటీఆర్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ్ముడు మంచిరేవులలో దేవాదాయశాఖకు చెందిన రూ.600 కోట్ల భూములను కబ్జా చేయాలని చూస్తున్నారు. ఈ భూముల గురించిన ఫైల్ మీద మంత్రి కొండా సురేఖ సంతకం పెడితే, రేవంత్‌రెడ్డి జపాన్‌లో ఉండి ఆపించారు. అసలు రేవంత్‌రెడ్డి అన్నదమ్ములకు పోలీస్ ఎస్కార్ట్ ఎందుకని మంత్రి కొండా సురేఖ కూతురే ప్రశ్నిస్తున్నది. సొంత ప్రభుత్వంపై మంత్రి కూతురే ఆరోపణలు చేస్తుంటే.. అసలు వీళ్లు ప్రభుత్వాన్నే నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? అనే అనుమానం కలుగుతున్నది.
-కేటీఆర్
రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన సాగుతున్నదని, ఆ ముఠా నాయకుడు రేవంత్‌రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. వీరి అవినీతి, అక్రమాలు, అరాచకాలకు అధికారులు సైతం హడలిపోతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలకుల వాటాల పంచాయితీలో తమకు భాగస్వామ్యం వద్దంటూ అధికారులు పారిపోతున్నారని విమర్శించారు. ‘ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయమని వేధించడం వల్లనే వారు వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకుంటున్నారు. మంచి అధికారులు కూడా పారిపోయేలా చేసే దండుపాళ్యం ముఠా రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రులు, దండుపాళ్యం ముఠా తరహాలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల్లో, అక్రమాల్లో భాగస్వాములైతే, కాంగ్రెస్ కార్యకర్తల్లా వత్తాసు పలికితే అధికారులకు కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. అధికారులు, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, చట్ట పరిధిలో పనిచేయాలని, మంత్రుల అవినీతి వాటాల పంచాయితీలకు దూరంగా ఉండాలని సూచించారు. తాను చెప్పిన పనిచేయలేదని, వీఆర్ఎస్ తీసుకోకుండా రిజ్వీని, ఆయన రాజీనామాను ఆమోదించవద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరడం ప్రభుత్వ వేధింపులకు నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే, తాము వందల కోట్లయినా సంపాదించ వద్దా అని మంత్రులు పోటీ పడుతున్నారు. గన్నులు పెట్టి బెదిరించడంతో వ్యాపారవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో గనకల్చర్ నడుస్తున్నదని మంత్రి కూతురు చెప్పింది. పోలీసులు వెతుకుతున్న నిందితుడిని అరెస్టు చేయొద్దు అంటూ మంత్రి కుమార్తె ఆపితే.. స్వయంగా మంత్రి తన కారులో నిందితుడిని తీసుకొని వెళ్లిపోయినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవు. వాటాల పంచాయితీ, అవినీతి సొమ్ముల పంపకాలు, టెండర్ల రిగ్గింగ్ ఇవన్నీ కాంగ్రెస్ ఇంటి పంచాయితీ లెక మారిపోయాయి. ముఖ్యమంత్రి ఇల్లు సెటిల్మెంట్లకు కేంద్రంగా మారిపోయింది. రెండు మూడు రోజులపాటు తిట్టుకొని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరు కలిసి శాలువాలు కప్పుకుని స్వీట్లు పంచుకున్నారు. ఏం ఉద్ధరించారని ముఖ్యమంత్రికి శాలువా కప్పి పీసీసీ ప్రెసిడెంట్ సన్మానం చేశారు?’ అని కేటీఆర్ నిలదీశారు.
రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతుంటే, మంత్రులు, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇంత అరాచకం కొనసాగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘పరిశ్రమల యజమానులకు తుపాకీలు పెట్టినప్పుడు, మంత్రులు బజారుకెకినప్పుడు, సీనియర్ అధికారులు పారిపోతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది? తుపాకీ ఇచ్చింది రేవంత్‌రెడ్డి, తెచ్చింది రోహిన్‌రెడ్డి అని స్వయంగా మంత్రి కుమార్తె చెప్పింది. కానీ, పోలీసులు మాత్రం గన్ ఇచ్చింది కొండా మురళి, బెదిరించింది కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ అని చెప్తున్నారు. రెండు అంశాల్లో కూడా బెదిరింపులు గన్నుతో జరిగాయనేది వాస్తవం. కానీ, ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ‘నాకు పింకు బుకులు లేవు.. రెడ్ బుకులు లేవు.. కేవలం ఖాకీ బుకు మాత్రమే రాష్ట్రంలో ఉంటుంది’ అని గొప్పలకు పోయిన రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నాడు? ఖాకీ బుక్కును కాకులు ఎత్తుకుపోయాయా?’ అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కన్నా అత్యుత్సాహం చూపుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మా కార్యకర్తలను జైల్లో పెట్టిన పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చేలా పనిచేస్తున్నారు. కొంతమంది పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కన్నా దారుణంగా పనిచేస్తున్నారు. నిజంగా డీజీపీకి నిజాయితీగల పేరు ఉంటే గన్నుల బెదిరింపు వ్యవహారంలో చర్యలు తీసుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. పోలీస్ యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే.. గన్ను తెచ్చింది ఎవరు? గన్ను గురిపెట్టింది ఎవరు? అనే విషయాన్ని తేల్చాలి. ఈ అంశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు బయటకు వచ్చినందున ఆయనను కూడా విచారణ చేసి అభిప్రాయాన్ని రికార్డు చేయాలి. సుమంత్‌ను విచారించి నిజానిజాలు బయటపెట్టాలి. గన్నుతో గురిపెట్టిన ఘటనలో కచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. పోలీస్‌శాఖలో 99% మంది బాగానే ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు. కానీ ఒక శాతం మంది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. వారినే మేము ఈరోజు నిందిస్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. మాఫియా రాజ్యం. ఈ అరాచకానికి అడ్డుకట్ట వేసే శక్తి ప్రజలకు మాత్రమే ఉన్నది. జూబ్లీహిల్స్ నుంచే ఓటుతో వారికి బుద్ధిచెప్పాలి.
-కేటీఆర్
మంచిరేవుల భూముల కోసం గన్ను పెట్టి బెదిరిస్తున్నారని మంత్రి సురేఖ కూతురు స్వయంగా చెప్పినప్పుడు ఏం చేస్తున్నారని కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు. ‘మంత్రులు ఎకడ సంతకం పెట్టారో సొంత కుటుంబసభ్యులకు కూడా తెలవకూడదు అన్న నియమాలు ఉన్నాయి. ఇవన్నీ మంత్రి బిడ్డకు తెలపడం, జపాన్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఫైలు వెనకి తెప్పించుకోవడం ఇదంతా ఆరాచకంగా మారింది. ముఖ్యమంత్రి సోదరుడు 15 ఎకరాలు, కొండా సురేఖ 15 ఎకరాలు తీసుకొని మొత్తం 30 ఎకరాల భూమి పంచాయితీ పెట్టుకున్నారు. మంచిరేవులలో ఈ భూమి మొత్తం నాకు కావాలంటే, నాకు కావాలి అని మంత్రి, రేవంత్‌రెడ్డి, కొండా సురేఖ కొట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మొత్తం ఈ వ్యవహారం బయటపెట్టుకొని తిరిగి రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? గతంలోనే కేసీఆర్ చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుకలు చింపిన విస్తరిలా చేస్తారు అని. మంత్రులు కాంట్రాక్టులు, కమీషన్ల వ్యవహారాన్ని ఇంటి పంచాయితీగా మార్చారు. మంత్రి పొంగులేటి తన టెండర్లలో తలదూర్చారని మంత్రి కూతురు స్వయంగా చెప్పింది. బెదిరింపులు, టెండర్ల రిగ్గింగు ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడూ జరగలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేశానని మంత్రి కూతురు చెప్పినప్పుడు ఉత్తమ్‌ను పిలిచి పోలీసులు విచారించరా? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని దకన్ సిమెంట్ కంపెనీ యజమానిపై గన్ను గురిపెట్టినప్పడు కనీసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, రోహిన్‌రెడ్డిని, సుమంత్‌ను ఎవరినీ కూడా పోలీసులు విచారించలేదు’ అని కేటీఆర్ నిలదీశారు.
కాంగ్రెస్ పరిపాలనలో ప్రజాపాలన లేదని, అరాచకాలు, అవినీతి, బెదిరింపులు, కమీషన్లు, టెండర్ల రిగ్గింగ్ అన్నీ నడుస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అరాచక పాలనను చూసి అసహ్యించుకుంటున్నారని చెప్పారు. అందుకే కావచ్చు చాలా అనుభవజ్ఞుడైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజాన్ని చెప్పారని పేర్కొన్నారు. ఇంత అరాచక, అవినీతితో కూడిన పరిపాలన ఆయన చూసి ఉండరు కాబట్టి, తెలంగాణలో మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అని చెప్పారని వెల్లడించారు. తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని, ఆకాంక్షలను వ్యక్తపరిచినందుకు తమ పార్టీ తరఫున ఖర్గేకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇంత దారుణంగా బహిరంగంగా అవినీతి అంశంపైకి వచ్చినా, బెదిరింపులు బయటపడినా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ పరిపాలన నడుస్తున్నదని విమర్శించారు. ‘ఓపెన్‌గా ఇంత జరుగుతుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, అమిత్‌షా ఎందుకు మాట్లాడటం లేదు? ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడుతుంటే, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? సీబీఐ లాంటి సంస్థలు ఎందుకు రావడం లేదు? కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అమ్ముడు పోయింది. అందుకే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎవరూ మాట్లాడటం లేదు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా మౌనంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ఏమాత్రం కాపాడలేదని మేము చెప్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.