హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సచివాలయం, తెలంగాణ అమరజ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టటంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. రేవంత్‌రెడ్డి చర్యకు నిరసనగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను ఎకడికకడ పార్టీ శ్రేణులు సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏమిటని తెలంగాణ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తున్నదని తెలిపారు. చేసిన తప్పును రేవంత్‌రెడ్డి సరిదిద్దుకోవాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయం, అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని 2023 జూలైలోనే కేసీఆర్ ఈ స్థలాన్ని ఎంపిక చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ ఎంపిక చేసిన స్థలానికి తెలంగాణ సమాజం యావత్తు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కుసంసారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధంలేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన చర్యతో తెలంగాణలోని ప్రతి వ్యక్తిని గాయపర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించి సకల మర్యాదలతో గాంధీభవన్‌కు తరలిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం చేస్తారని తాము ముందునుంచే చెప్పామని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి సరిగ్గా ఇప్పుడు అదే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ బాసుల మెప్పు కోసమే తెలంగాణను ఆత్మను తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనోభావాల కన్నా ఢిల్లీ బాసుల మెప్పు పొందడమే కాంగ్రెస్‌కు పాలకులకు ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి చర్యను యావత్తు తెలంగాణ సమాజం చీదరించుకుంటున్నా సిగ్గు లేకుండా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ నాయకులకు స్వప్రయోజనాలే ముఖ్యమైపోయాయని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి గులాములేనని తేలిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలా? ఢిల్లీ బాసులా? అంటే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీ బాసులకే జీ హుజూర్ అంటారనే విషయం మరోసారి స్పష్టమైందని తెలిపారు. తెలంగాణ అస్తితత్వంతో పెట్టుకున్న వాళ్లెవరు రాజకీయంగా బతికి బట్టకట్టలేదని హెచ్చరించారు. మన ప్రాంతంవాడే మన అస్తిత్వతాన్ని దెబ్బ తీస్తుంటే తెలంగాణ ప్రజలు వారికి రాజకీయంగా సమాధి తవ్వడం ఖాయమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు హాజరవుతారు. మరోవైపు ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంతో వేడుకలు నిర్వహిస్తున్నది. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహించనున్నది.
ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలు ఏమయ్యాయని ప్రధాని నరేంద్రమోదీని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నదని నాలుగు నెలల క్రితం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేస్తూ ఎక్స్ వేదికగా నిలదీశారు. తెలుగులో తీసిన ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల కన్నా ‘డబుల్ ఆర్ ట్యాక్స్’ కలెక్షన్ ఎక్కువ అయిందని ఆరోపించిన ప్రధాని ఆ ట్యాక్స్‌పై చర్యలు తీసుకునేందుకు ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిండ్లగూడెంలో 16 రోజులుగా విద్యుత్తు సరఫరా లేకపోవడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుకు మామిండ్లగూడెంలో నెలకొన్న చీకటే సంకేతమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్తుకు ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. కనీసం ఇప్పటికైనా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కల్పించుకొని మామిండ్లగూడెం ప్రజల కరెంట్ కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.
శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేతను సిరికొండ మధుసూదనాచారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ సిరికొండను శాసనమండలిలో విపక్షనేతగా గుర్తించాలని శాసనసభా కార్యదర్శికి పార్టీ అధినేత కేసీఆర్ గతంలో లేఖ రాయడం, అందుకు అనుగుణంగా గుర్తింపు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బాల సుమన్, గాదరి కిశోర్, పార్టీ నేత రాకేశ్‌రెడ్డి తదితరులు కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు.
తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుందని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఢిల్లీ బాసుల మెప్పు కోసం కాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ముందు నిలబడుతుందని తెలిపారు. ఎప్పటికైనా తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతన్నకు కాళేశ్వరం వెయ్యి ఏనుగుల బలం అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘నాడు..నేడు.. ఏనాడైనా తెలంగాణ రైతన్నకు వెయ్యి ఏనుగుల బలం కాళేశ్వరం. భారీ వరదలనే కాదు బురద రాజకీయాలను తట్టుకుని నిలబడిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సలాం’ అని ఆయన ఎక్స్ చేశారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన ‘కూలిందెక్కడ? మింగిందెవరు?’ అనే ప్రత్యేక కథనాన్ని ఆయన ఎక్స్‌వేదికగా ట్యాగ్ చేశారు. ‘దశాబ్దాల సాగునీటి కష్టాలను తీర్చి అన్నదాతల కన్నీళ్లను తుడుస్తున్నందుకు యావత్ తెలంగాణ సమాజం పక్షాన కాళేశ్వరం ప్రాజెక్టుకు సెల్యూట్’ అని పేర్కొన్నారు.