హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ‘సత్యమేవ జయతే’ అంటూ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై ఆయన ఎక్స్ వేదికగా శుక్రవారం హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌రెడ్డి ఫిరాయింపు రాజకీయాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందని ధీమా వ్యక్తంచేశారు.
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ ద్వంద్వనీతి బట్టబయలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఫిరాయింపుదారులకు రక్షణ కల్పించే సర్కార్‌కు ఈ తీర్పు చెంపపెట్టు అని ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీకి రాజ్యాంగంపై చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రజాతీర్పును, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన స్పీకర్ వ్యవస్థ.. అందుకు విరుద్ధంగా దానంకు రక్షణ కవచంగా నిలవడం దురదృష్టకరమని అన్నారు.
దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని రక్షించే చాంపియన్ అని చెప్పుకొనే రాహుల్ కపట నాటకాలు ఈ ఘటనతో బట్టబయలయ్యాయని దెప్పిపొడిచారు. పార్టీ ఫిరాయించిన వారిపై ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడేలా 10వ షెడ్యూల్‌ను సవరిస్తామని 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ అధిష్ఠానం.. మరి అదే పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నది? రాహుల్ రాజ్యాంగ నిబద్ధత ఎక్కిడికి పోయింది? అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై రాహుల్‌కు ఉన్న నిబద్ధత నిజమైనదా? లేదంటే మీ సౌలభ్యానికి, రాజకీయ అవసరాలకు తగ్గట్టు మారుతుందా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ స్పందించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
దానం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి గుణపాఠమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా భంగపాటు తప్పదని హెచ్చరించారు. అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనబెట్టడం ప్రజాస్వామ్య విజయమని అన్నారు. ఫిరాయింపుల ద్వారా అధికారాన్ని బలోపేతం చేసుకోవచ్చని అనుకోవడం సరికాదనే విషయం న్యాయస్థానం తీర్పుతో తేటతెల్లమైందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకొని రాజ్యాంగాన్ని గౌరవించాలని హితవుపలికారు.