ద్యానబోయిన నవిత బీఆర్ఎస్ కార్యకర్త కూతురు. కరోనాలో తండ్రిని, ఏడాది కిందట యాక్సిడెంట్లో అన్నను కోల్పోయింది. ఇప్పుడు తన పెండ్లి. పత్రికను వాట్సాప్‌లో కేటీఆర్‌కు పంపింది. రావాలని కోరింది. ఆదివారం సిరిసిల్ల జిల్లా నర్మాలలో జరిగిన నవిత- సంజయ్ పెండ్లికి కేటీఆర్ హాజరయ్యారు. రామన్నను చూసి నవిత ఇలా భావోద్వేగానికి లోనైంది.
హైదరాబాద్/గంభీరావుపేట, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ధ్యానబోయిన నర్సింహులు.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. జీవితకాలం పార్టీ కోసం పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో కాలం చేశారు. ఈయన కొడుకు నరేశ్ కూడా గులాబీ జెండానే పట్టాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాన్నను, అన్నయ్యను కోల్పోయిన నర్సింలు బిడ్డ నవితకు పెండ్లి కుదిరింది. నా అనేవాళ్లు దూరం కావడంతో కేటీఆర్‌నే అన్నగా భావించింది. ఈ నెల 17న జరిగే తన వివాహానికి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఆ ఆడబిడ్డ ఆహ్వానం కేటీఆర్ మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించి తన బాధ్యతగా, కర్తవ్యంగా భావించిన కేటీఆర్ ఆదివారం నవిత-సంజయ్ వివాహానికి వెళ్లి నవ దంపతులను ఆశీర్వదించారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని వారికి భరోసా ఇచ్చారు. ఇదే విషయంపై తన ప్రత్యేకమైన అనుభూతిని ఎక్స్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు.
‘ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది. కానీ, నా చెల్లి తన నాన్న, అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చమని నన్ను పిలిచింది. ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు.. అది నా మీద ఉంచిన నమ్మకం, ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ. ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించాను. నికార్సయిన తెలంగాణ బిడ్డలే బీఆర్ఎస్ బలం, బలగం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింహులు జీవితకాలం బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేశారు. కరోనా విపత్తు సమయంలో ఆయన మరణించారు. ఆ తర్వాత ఆ ఇంటికి పెద్ద దికుగా ఉన్న ఆయన కుమారుడు నరేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తాను చనిపోయినా తన అవయవాలు జీవన్‌దాన్‌కు దానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
చెల్లెలు నవిత ఆనందంలో భాగస్వామి కావడం, ఆమెకు అండగా నిలవడం అన్నగా, ఆత్మీయుడిగా నా బాధ్యత అని భావించాను. ప్రజలతో ఉన్న అనుబంధం రాజకీయాలకు మించినది. ఇలాంటి సందర్భాలు నాకు ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి. మనందరిదీ ఒకటే కుటుంబం అని, చెల్లెలు నవిత-సంజయ్ దంపతుల కొత్త జీవిత ప్రయాణం సంతోషం, ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్న. మీకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇస్తున్న’ అని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.