పెనుబల్లి, సెప్టెంబర్ 5: బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ యువకుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండంత ధైర్యం చెప్పారు. వైద్యానికి ఎంత ఖర్చయినా పార్టీ భరిస్తుందని భరోసా ఇచ్చారు. అధైర్య పడొద్దని, తాను ఇంటికి వచ్చి కలుస్తానని అభయమిచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచందర్‌రావుబంజర్ గ్రామానికి చెందిన బన్నె వెంకటేశ్వరరావు – దేవి దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురికి పెండ్లి కాగా.. కొడుకు మణికంఠయాదవ్ నిరుడు టెన్త్ పాసై ఇంటర్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో జ్వరంతో అనారోగ్యానికి గురికావడంతో పలు దవాఖానల్లో చికిత్స చేయించినా అతడు కోలుకోలేదు.
హైదరాబాద్‌లోని ఎంఎన్జీ దవాఖానకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి బోన్ క్యాన్సర్ (బోన్ మ్యారో) బారిన పడినట్టు నిర్ధారించారు. అప్పటికే పరీక్షలు, వైద్యం కోసం తల్లిదండ్రులు రూ.లక్షలు ఖర్చుచేశారు. వారిచేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో 20 రోజుల క్రితం ఎంఎన్జీ నుంచి వెంటిలేటర్‌పైనే ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అదే వెంటిలేటర్‌పై ఉంటూ మణికంఠ నరకయాతన అనుభవిస్తుండగా.. తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. స్థానిక నాయకుల ద్వారా శనివారం యువకుడి విషయం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. వెంటనే వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫోన్‌చేసి సదరు యువకుడితో వీడియోకాల్ మాట్లాడించారు.
ధైర్యంగా ఉండు.. మీ ఇంటికొచ్చి కలుస్తా: కేటీఆర్
‘తమ్మీ ధైర్యంగా ఉండు. నేనే మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతా.. నీ వైద్యానికి ఎంత ఖర్చయినా పార్టీ నుంచి భరిస్తాం.. నీకు, కుటుంబానికి అటు వీరన్న (వెంకటవీరయ్య), ఇటు నేను అండగా ఉంటాం.. ఏం కావాలో చెప్పు.. భయపడకు.. నువ్వు ధైర్యంగా ఉండాలి.’ అంటూ ఆ వీడియోకాల్‌లో మణికంఠకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. సదరు యువకుడు బదిలిస్తూ.. ‘సార్ నేను మిమ్మల్ని ఒక్కసారి చూడాలి.. నేరుగా మీతో మాట్లాడాలి’ అని పేర్కొన్నాడు. కేటీఆర్ స్పందిస్తూ.. ‘తప్పకుండా తమ్మీ.. త్వరలోనే మీ ఇంటికి వస్తా.. అప్పటివరకు ధైర్యంగా ఉండాలి’ అని ధైర్యం చెప్పగా.. మణికంఠ భావోద్వేగానికి గురయ్యాడు.