హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగ విరమణ పొందిన అధికారులకు పునర్నియామకాల పర్వం జోరుగా కొనసాగుతున్నది. రిటైర్డ్ అధికారుల పొడిగింపును అధికారంలో ఉన్నప్పుడు తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదేబాటలో పయనిస్తుండటం సచివాలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా మిషన్‌భగీరథ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో కీలక అధికారులకు మళ్లీ ఎక్స్టెన్షన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిషన్ భగీరథ ఈఎన్సీ జీ కృపాకర్‌రెడ్డి 2017లోనే ఉద్యోగ విరమణ పొందారు. ఈయన గత 8-9 ఏండ్లుగా కుర్చీకే అతుకుపోయారు. ఏప్రిల్ 30తో గడువు ముగియగా, తాజాగా ఈయన ఉద్యోగకాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. పంచాయతీరాజ్ ఈఎన్సీ జోగారెడ్డి నిరుడు అక్టోబర్‌లో ఉద్యోగ విరమణ చేశారు. ఈయనకు ఇప్పటికే ఒకసారి పొడిగింపు ఇవ్వగా, తాజాగా మరో 3 నెలలపాటు ఉద్యోగంలో కొనసాగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2009లోనే వీఆర్ఎస్ తీసుకున్న స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి.. కొన్నేండ్లుగా అదే పోస్టులో కొనసాగుతున్నారు. ఈయన గడువు కూడా మే 23తో ముగియనున్నది.
రిటైర్డ్ అధికారులు కుర్చీలు ఖాళీ చేయకపోవడంతో, సర్వీసులో ఉన్న అర్హులైన అధికారుల కెరీర్ ఎదుగుదల దెబ్బతింటున్నది. కృపాకర్‌రెడ్డి కొనసాగింపు వల్ల మి షన్ భగీరథలో సుమారు ఏడుగురు సీనియర్ చీఫ్ ఇంజినీర్లు ఉద్యోగోన్నతులు రాక ఈఎన్సీలుగా రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జోగారెడ్డి ఉద్యోగకాలం పెంచడంతో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఆశాఖ అధికారుల్లో నైరాశ్యం అలుముకున్నది. దీనిపై నిరుద్యోగులు, ప్ర భుత్వ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మిషన్ భగీరథ పనులు ఏడేండ్ల్ల క్రితమే పూర్తయినప్పటికీ, భారీగా సిబ్బందిని, రిటైర్డ్ అధికారులను కొనసాగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఏప్రిల్ 30 గడువు ముగిసినా మళ్లీ పొడిగింపులు ఇవ్వడంపై శాఖలోని ఇతర అధికారులు ‘మాకు ఉద్యోగోన్నతులు దకేది ఎప్పుడు?’ అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.