హైదరాబాద్: ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) క్రమంగా నిండుతున్నది. దీంతో సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేస్తారు. సాయంత్రం 4.10 గంటల వరకు సాగర్ ఎడమకాలువ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని విడుదల చేస్తార జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. అనంతరం నాగార్జునసాగర్ డ్యామ్ సందర్శిస్తారని తెలిపారు. కాగా, ఇప్పటికే కుడి కాల్వ ద్వారా 5,944 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే నీటి ప్రవాహాన్ని తట్టుకుని కింది వరకూ పంపాల్సిన కాల్వలు అందుకు తగట్టు ఉన్నాయా అంటే.. లేవనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడమ కాల్వ కట్టలు పలుచోట్ల బలహీనంగా ఉండడంతో ఎక్కడ గండి ఏర్పడుతుందోనన్న భయాందోళన రైతుల్లో నెలకొంది. వారం క్రితం నడిగూడెం మండలం రామాపురం వద్ద కాల్వ కట్టకు బుంగ పడగా, అధికారులు మర్మతులు చేయకుండా వదిలేశారు. కేవలం అటుగా ఎవరూ వెళ్లకుండా కంప చెట్లు వేసి, హెచ్చరిక ఫ్లెక్సీని మాత్రం ఏర్పాటుచేశారు. రెండు సంవత్సరాల క్రితం నిడమనూరు మండలం ముప్పారం-వేంపాడు వద్ద నారెళ్లగూడెం మేజర్ సమీపంలో పడిన గండి ఎంత విధ్వంసం సృష్టించిందో రైతులు ఇంకా మరిచిపోలేదు.
అప్పట్లో లక్ష్మీదేవిగూడెం, నిడమనూరు, నర్సింహులుగూడెం గ్రామాల్లోని వందలాది ఎకరాల్లో పంట మునగడంతోపాటు అడుగల మేర ఇసుక మేటలు వేసింది. చుట్టుపక్కల ప్రజలకు కంట మీద కునుకు లేకుండా పోయింది. దానికితోడు మరమ్మతుల కారణంగా నీరందక వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అధికారుల నిర్లక్ష్యంతోనే పరిస్థితి ఇంత తీవ్ర రూపం దాల్చిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికీ అనేక చోట్ల ఎడమ కాల్వ కట్టలు బలహీనంగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటికే గత రెండు సీజన్లు ఆయకట్టుకు నీళ్లు రాలేదు. ఇప్పుడు వరుణుడి కరుణతో వరద పోటెత్తుండడంతో ఆశలు చిగురిస్తుండగా, కాల్వల పరిస్థితి భయపెడుతున్నది.