హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పర్యావరణ సమతుల్యతను బాధ్యతగా స్వీకరించాలని, ఆ విషయంలో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ‘గ్రీన్ సౌత్ అలయెన్స్ ఎనర్జీ ట్రాన్సిషన్’ సదస్సు కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణం, గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్‌పై కార్యాచరణ రూ పొందించకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పర్యావరణ పరిరక్షణ లో ప్రజలను భాగం చేయాలని, అప్పు డే సత్ఫలితాలు వస్తాయని, అందుకు తెలంగాణ ఒక కేస్ స్టడీగా తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేసి ప్రజలను భాగస్వామ్యం చేయటంతో స్వల్పకాలంలోనే తెలంగాణలో గ్రీన్‌కవర్ పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రీన్ఎనర్జీ ట్రాన్సిషన్‌లో భారతదేశం విశేష పురోగతి సాధించిందని, డీకార్బనైజేషన్ కోసం మరింత ముందుకెళ్తుందని చెప్పారు.