సుల్తాన్‌బజార్, నవంబర్ 30: హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీ పేరును యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు శనివారం ఆందోళనకు దిగారు. చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా యూజీసీలో చేర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు మండిపడ్డారు. తమ ఐడీ కార్డుల్లో తెలంగాణ మహిళా యూనివర్సిటీగానే ఉండటంతో భవిష్యత్తులో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సర్టిఫికెట్లలో కూడా గందరగోళం నెలకొంటుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రానున్న శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో వర్సిటీ పేరును యూజీసీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీ సూర్యా ధనుంజయ్ అక్కడికి చేరుకుని విద్యార్థుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.