పట్టణ ప్రకృతి వనాలపై పర్యవేక్షణ కరువు
అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా పీపీవీలు
Kothagudem | కొత్తగూడెం అర్బన్, మే 16 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు, సాయంత్రం వేళ కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా సేదతీరేందుకు ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాలను(పీపీవీ) ఏర్పాటు చేసింది. ప్రతి పట్టణంలో రెండు ఎకరాల పైన ఉన్న స్థలంలో చిట్టడవులను పెంచాలని తద్వారా పట్టణవాసులకు కొంత వరకైన వాయు కాలుష్యం బారి నుంచి తప్పించుకొని స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు అవకాశం ఏర్పడుతుందని భావించి ఎంతో శ్రద్ధ, ఆసక్తితో పీపీవీలకు అంకురార్పన చేసింది. వీటి నిర్వహణ కోసం “పట్టణ ప్రగతి” నిధుల ద్వారా ప్రత్యేకంగా నిధుల వెచ్చించింది. వేప, తంగెడు, చింత, టేకు, గానుగ, ఇంకా పలు రకాల మొక్కలను నాటి వాటి నిర్వహణ బాధ్యత కోసం ఒక వాచ్ మెన్ ను సైతం నియమించింది. ఆనాటి అధికారుల పర్యవేక్షణ వల్ల మొక్కలు ఏపుగా పెరిగి వార్డుకే అందాన్ని తెచ్చాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ వీటిని పట్టించుకోకుండా సరైన నిర్వహణ లేక పీపీవీలను గాలికి వదిలేసింది.
ఎంతో అహ్లాదాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాలు ప్రస్తుతం అసాంఘీక కార్యకలాపాలకు, మందుబాబులకు ప్రస్తుతం అడ్డాగా మారాయి. రాజీవ్ పార్క్ సమీపాన ఏర్పాటు చేసిన చిట్టడవి(పీపీవీ) నిర్వహణపై అధికారులు చేతులెత్తేశారు. నిత్యం మందుబాబులు దీనిని అడ్డాగా చేసుకొని యధేచ్ఛగా తమ కార్యకలాపాలను సజావుగా సాగించుకుంటున్నారు. వనంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడడంతో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఎక్కడపడితే అక్కడ మద్యం సీసాలు లభ్యమవుతున్నాయి. దీని చుట్టూ చెత్త వేయడంతో ఈ ప్రాంతమంతా దుర్గంధంగా మారింది. ఇక పట్టణంలోని దో నెంబర్ బస్తీలో ఏర్పాటు చేసిన ‘మినీ పట్టణ ప్రకృతి వనం’ సమస్యలు అన్నీ ఇన్నీ కావు. దీనిలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ లో కంకర తేలి, పిచ్చిమొక్కలు మొలిచాయి. ఇప్పటికైనా ప్రకృతి వనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు అహ్లాదం పంచే విధంగా సుందరంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణ ప్రకృతి వనాలను పట్టించుకోవడం లేదు. దీని చుట్టు చెత్త, చెదారం పోయడంతో ఒక డంపింగ్ యార్డుగా మారింది. వీటి గేటుకు తాళం కూడా వేయడం లేదు. దీంతో మందుబాబులు తాగడానికి వీటిని ఉపయోగించుకుంటున్నారు. స్థానిక ప్రజలకు ఇది ఇబ్బందిగా మారింది. అధికారులు ఈ ప్రకృతి వనంను శుభ్రం చేసి నిత్యం పర్యవేక్షించాలి.