హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన-విస్తరణ సలహా కమిటీ సభ్యుడిగా కోటపాటి నరసింహం నాయుడును నియమించారు. ఈ మేరకు అధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సలహా కమిటీ సభ్యుడిగా రెండేండ్లపాటు ఆయన కొనసాగనున్నారు. కోటపాటి దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా అనేక రాష్ట్రాల రైతులు, వారి పంట విధానాలపై విసృ్తతంగా అధ్యయనం చేశారు.
ఈ సందర్భంగా 48వ ఆర్ఈఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే వంగడాలపై పరిశోధనలు జరగాలని కోరారు. సేంద్రియ పద్ధతులు, పశువుల పోషణ ద్వారా ఎరువులు, వ్యర్థ జలాలను శుద్ధి చేసి పంటలకు ఉపయోగించడం భారతీయ పురాతన వ్యవసాయ విధానమని వివరించారు. రైతులు పంటల పెట్టుబడులు తగ్గించుకుని.. అధిక దిగుబడులు సాధించే మార్గాలను అన్వేషించాలని సూచించారు.