హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యార్థుల మరణాలన్నీ(Student deaths) ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar)ఆరోపించారు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాగా చదువుకొని తన భవిష్యత్తు తీర్చి దిద్దుకుదామని ఎన్నో కలలు కన్న అభం శుభం తెలియని అమ్మాయి ఫుడ్ పాయిజన్‌తో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడటం విచారకరమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలని మండిపడ్డారు. హాస్టళ్లలో పురుగులన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అంతేకాదు టీచర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కినా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయిలేదని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. శైలజకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.