హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంతూరైన నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ భవనానికి ఆయన తండ్రి ఎనుముల నర్సింహారెడ్డి పేరు పెట్టడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొండారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.
రేవంత్రెడ్డి సీఎం అయ్యాక అదనంగా ఎస్డీఎఫ్ (స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్) కింద రూ.73 లక్షలు కేటాయించి భవనాన్ని పూర్తి చేశారు. గత దసరా పండుగ రోజు సొంతూరికి వచ్చిన సందర్భంగా రేవంత్రెడ్డి పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి రేవంత్ తండ్రి పేరు పెట్టడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చందంగా.. ప్రభుత్వ నిధులను స్వకార్యానికి వెలగబెడుతున్నారని ప్రజలు తీవ్ర విస్మయం చెందుతున్నారు.